శ్రీ పోతరాజు నర్సింహం పంతులు గారి పుట్టుపూర్వోత్తరాలు - ఉపోద్ఘాతం(Introduction Part 02)
శ్రీ పోతరాజు నర్సింహం పంతులు గారి పుట్టుపూర్వోత్తరాలు
ఉపోద్ఘాతం(Introduction Part 02)
కి॥ శే॥ శ్రీ పోతరాజ నరసింహం పంతులుగారు 13-10-1883 రాత్రి గం॥ 12-20 ని॥లకు జన్మించారు.
బాల్యంలోనే తల్లిని ఆ తర్వాత రెండు సంవత్సరాలకు తండ్రినీ పోగొట్టుకొని, వారి మేనత్తగారి పోషణలో పెరిగారు.
స్కూలు ఫైనలు వరకు విశాఖపట్టణంలోను ఆ తర్వాత M.A. వరకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను చదివేరు.
తర్వాత ఎడ్యుకేషనల్ సర్వీసులో (M.ES.) చేరి ఫిలాసఫీ ప్రొఫెసరుగా, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను, కుంభకోణము ప్రభుత్వ కళాశాలలోను పనిచేసి రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాలుగా రిటైరైనారు.
శ్రీ P.N. (శ్రీ నరసింహం పంతులుగారిని ఈ యోగసాధకులందరు శ్రీ పి. యన్. అని పిలవడం అలవాటు) 1913-1914 ప్రాంతంలో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో పనిచేస్తుండేవారు అప్పుడు వారు థియోసాఫికల్ సొసైటీ మెంబరుగా ఉంటూ వారి కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేవారు.
అప్పట్లో ఆ సంఘ సభ్యులందరు నమ్ముతూ వస్తున్న కొన్ని విషయాలు వమ్ము(తప్పులని నిరూపించబడడం) అయిపోయిన కారణంగా వారి కార్యకలాపాలలో నమ్మకము పోయి, మత విషయాలలో మానవుల నమ్మకాల మీద వారికి ద్వేషం ప్రబలింది.
ఆ మానసికోద్వేగంలో శ్రీ P.N. జంధ్యం త్రెంచి, తద్దినాలు పెట్టడం మాని, పూర్తి నాస్తికులైనట్లుగా ఉండేవారు.
అప్పటికే ఈ యోగ సాధన చేస్తున్న శ్రీ S. నారాయణయ్యరు గారితో పరిచయం గల్గి అప్పుడప్పుడు వారితో వేదాంత విషయాలు ప్రసంగం చేస్తుండేవారు.
మాటల సందర్భంలో ఒక రోజు నారాయణయ్యరుగారు, P.N. గారితో, “కుంభకోణంలో ఒకరు ఉన్నారు. వారు మానవుడు చావులేకుండా శాశ్వతముగా ఉండేందుకు యోగము చేస్తున్నారు. వెళ్ళి చూడరాదా?” అన్నారు.
ఆ మాటలకు P.N. గారు “పాంచభౌతిక మైన ఈ శరీరం ఏనాటికైనా చావవలసిందే. చావు లేకపోవటమనేది అర్థంలేనిమాట” అని నవ్వేరట.
నీవు వేదాంతివి, వారు యోగి. చూచివస్తే నష్టమేమిటని రెండు నెలలు నారాయణయ్యరుగారు వెంబడిస్తే రెండురోజుల సెలవుమీద నారాయణయ్యరుగారితో కలిసి కుంభకోణం వెళ్లారు.
జంధ్యాలు త్రెంచి తద్దినాలు పెట్టడం మానేసిన తరువాత ఒక యోగిని చూడటానికి కుంభకోణం వెళ్తున్నారంటే ఆదోమాదిరిగా చూచారు ఇంట్లో వాళ్ళు, వారు కుంభకోణం వెళ్లారు.
యోగిగా పరిచయము చేయబడ్డ మాస్టర్ సి. వీ. వీ. గారు ఇంట్లో సాదా దుస్తుల్లో కూర్చొని ఉన్నారు.
మాస్టరుగార్ని యోగి అన్నారు గనుక కాషాయ గుడ్డలో, గడ్డాలు మీసాలతో ఉంటారనుకొన్నారు వారు. మాస్టరు గారు మామూలు గుడ్డల్లో సామాన్య మానవుల్లాగా నిరాడంబరంగా కనిపించేసరికి P.N. గారిలో కొంత ఆకర్షణ కలిగింది.
P.N. గారిని చూచి శ్రీ మాస్టరుగారు, “ఇంత చదువుకొన్నావు. వేదాంతివి, నీక్కావలసిందేమిటి ?” అని అడిగితే ఒక క్షణం కంగారుపడ్డా P.N. నిలద్రొక్కుకొని “పూర్ణజ్ఞానం” అన్నారట.
“విధి ప్రేరితమయిన ఈ సృష్టి కొన్ని నియమాల పరిధిలో ఆ పరబ్రహ్మ ఆదేశానుసారం సాగిపోతున్నది గదా? నీ పూర్ణజ్ఞానం నీ కెందుకు ఉపయోగ పడుతుంది?
జరుగబోయేదానిని ఆపగలవా? జరుగు తున్నదానిని వెంట్రుకవానసి తప్పించగలవా?
పూర్ణజ్ఞానంతో ఏమిటి నీవు చేయ గలిగింది? కావలసింది పూర్ణజ్ఞానంకాదు. స్థిరత్వము.
సాగిపోయే సృష్టితో కలిసి పోకుండా, మారుతున్న కాలంతో మారకుండా స్థిరంగా నిలవటమే మానవునికి కావలసింది కాని పూర్ణజ్ఞానంకాదు.
ఆ స్థిరత్వంకోసమే మేము యోగబ్యాసం చేస్తున్నాము. నీవు కూడా చేయవచ్చును.
మానవునికి స్థిరత్వాన్ని సాధించ టానికి ఆ పరబ్రహ్మం నుండి వచ్చిన నేను యీ ప్రయత్నం చేస్తున్నాను” అన్నారట. P.N. గారు యోగ మిత్రమండలిలో(Friends Society Yoga School) చేరారు.
ఆ విధంగా ఈ యోగంలో చేరిన శ్రీ P.N. గారు తర్వాత శ్రీ మాస్టరు గారికి అభిమానపాత్రులై, మాస్టరుగారి చరమదశలో చివరి రెండు సంవత్సరాలు వారి సాన్నిధ్యంలో గడిపి వారికి అతి చేరువైనారు.
ఆ రోజుల్లో శ్రీ P.N. గారు కుంభ కోణము కాలేజీలో పనిచేస్తుండేవారు. సాయంత్రం అయిదుగంటలు కాగానే మాస్టరు గారు రోడ్డుమీదకు వచ్చి ఎండుకు చేతులడ్డము పెట్టుకొని P.N. గారి కొరకు ఎదురుచూస్తూ నిలువబడేవారట. అట్టిది వారి సాన్నిహిత్యము.
ఆపైన శ్రీ P.N.గారు మద్రాసులో ఇల్లు కట్టుకొని అన్యచింతన లేక యోగ సాధకులకు మార్గదర్శకులుగా, తమవద్దకు వచ్చిన మిత్రులకు తగిన సలహాలు ఇస్తూ వారిని ఉత్తేజపరుస్తూ 1967 ఆగస్టు రెండవ తారీఖు వరకు జీవించారు.
ఉద్యోగరీత్యా మద్రాసు వెళ్తూ ఉంటే శ్రీ P.S.R శర్మ అనే నాకు వారి పరిచయ భాగ్యం కలిగింది. 1965 ఆగస్టు 12వ తారీఖున వారి పరిచయమైంది. 1967 జులై 31 వరకు ప్రతివారము పి. యన్. గారితో ప్రార్థన చేసికొనే అదృష్టం కలిగింది.
యోగంలో నా అభిరుచి నన్ను వారికి సన్నిహితుణ్ని చేసింది. వారి వాత్సల్యాన్ని పొంద గలిగేను, నా యందు పుత్ర వాత్సల్యముగల వారి సతీమణి శ్రీమతి సత్యవతమ్మ గారు. P.N. గారు గతించిన పిదప వారివద్ద గల అమూల్య గ్రంథములనన్నిటిని మాస్టరుగారి డైరీలతో సహా దయతో నాకిచ్చారు.
ఈ యోగ సంబంధమైన ఆ అమూల్య గ్రంథములు(Master Literature) - నా పూర్వపుణ్య ఫలము వలన నాకు లభించినవి.
Kindly peruse this article to gain further insights into the journey of how Masters Literature came into the hands of Sri P.S.R Sarma Garu: https://mastercvvyogam.blogspot.com/2023/09/blog-post.html
అందు వలన సాధక మిత్రు లెల్లరకు ఉపయోగకరము లైనవి, తెలుసుకొనవలసినవి, అవసరమైనవి చాలా విషయములు ఉన్నవి.
ఈ అపూర్వ గ్రంథములు వెదజల్లు సౌరథాన్ని నాతోపాటు నా సహసాధకులందరిచే అనుభవింపజేయాలన్న నా కోరిక ఈ “భృక్తయోగ పబ్లికేషన్స్” అను సంస్థను స్థాపింపజేసింది. ఇది లాభాపేక్షతో స్థాపించబడిన సంస్థ కాదు.
ఈ యోగ సంబంధమైన వ్యాసాలను, గ్రంధాలను వరుసగా ప్రచురించి సాధక మిత్రులకు, అభిలాష కుతూహలముగల నూతన మిత్రులకు సేవ చేయడమే యీ సంస్థ ముఖ్యోద్దేశ్యం.
ధనాభావంవల్ల ఇంతవరకు నేనేమీ చేయలేకపోయినాను. ఇంగ్లీషులో రచింప ఈ వ్యాసములను చదివిన మిత్రులు శ్రీ బాలసుందరరావుగారు నా అభిప్రాయమును అర్థంచేసుకొని శ్రీ P.N. గారి నోట్స్ ముద్రణకు అంగీకరించారు.
శ్రీ మాస్టరుగారు ప్రవచించిన “ప్యూరిటీ; ప్యూర్ లవ్; సింపతి; కో- ఆపరేషన్ (Purity - Pure Love - Sympathy - Co-operation)” అనే నాలుగు చక్రాలమీద మాస్టరుగారి ఆశయాలు వ్యాప్తి చెందాలనే మా ఆశయం.
సాధక విధేయుడు
పుసులూరి సీతారామ శర్మ
(P.S.R. Sarma)
__________________________________
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి