మాస్టరు గారి గురించి వారి ప్రత్యక్ష శిషులైన శ్రీ శంకర్ ఐయేరు గారు పంచుకున్న కొన్ని వాస్తవాలు.

మాస్టరు గారి గురించి వారి ప్రత్యక్ష శిషులైన శ్రీ శంకర్ ఐయేరు గారు పంచుకున్న కొన్ని వాస్తవాలు.


Telugu Transcript of above video is provided below.

శ్రీ T.S. శంకర్ అయ్యర్ గారు ‘అరవై ఏళ్ళ తపస్సు’ అన్న వ్యాసంలో తన అనుభవాలను పొందుపరిచారు ఈ రోజు వాటిని మీతో పంచుకుంటున్నాం.

1912వ సంవత్సరం నాటి మాట. అప్పుడు నేను ఒక ప్రభుత్వ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిని. ఒక మిత్రుడు ‘మేరి కరోల్’(Marie Corelli) వ్రాసిన పుస్తకం ‘ది లైఫ్ ఎవర్ లాస్టింగ్’(the life everlasting) ఇచ్చాడు చదవమని.

The Life Everlasting written by Marie Corelli: Read / Download

అది చదివినప్పుడు ‘మాస్టర్’ అనే పదం నన్ను ఆకర్షించింది. ‘మాస్టర్’ అనే మాటకు ఆమె చక్కని నిర్వచనం చెప్పంది. మాస్టర్, సాధకుడు అనే పదాలను వర్ణించి శాశ్వతత్వం అంటె ఏమిటో చెప్పింది. మేరీ కరోల్ వర్ణించిన మాస్టర్ స్పెయిన్ దేశంలో ఎక్కడో ఉన్నాడు. మాస్టర్ ని కలుసుకోవాలని నాలో ఆశ కలిగింది. కొన్ని రోజుల తరువాత ఒక రోజు శ్రీ S. నారాయణ అయ్యర్ తో మాట్లాడుతున్నాను. ఆయన నాకు బంధువు. మాస్టర్ గారి శిష్యుడు. ఆయనే ఈ యోగాన్ని గురించి నాకు చెప్పారు. మేరీ కరోల్ వర్ణన, నారాయణ అయ్యర్ వర్ణన ఒక్కటిగా ఉంది.  అప్పుడు అనుకున్నాను మహాత్ములు భారతదేశంలోనే జన్మిస్తారు. ఇదే పుణ్యభూమి అని.

మాస్టర్ గారి శిష్యుణ్ణి కావాలన్న నా కోరిక నాలో రోజురోజుకి ఎక్కువ కాజొచ్చింది. నన్ను ఆ మార్గంలో ప్రవేశ పెట్టమని నారాయణ అయ్యర్ ను అడిగాను. ఎందుకో నా కోరిక వెంటనే తీరలేదు. మాస్టర్ గారి ఫొటో సంపాదించి, దాని ఎదురుగా కూర్చుని ఏకలవ్యుని వలె మనస్సును ఆ ఫొటోపై నిమగ్నం చెయ్యటానికి ప్రయత్నించాను కాని లాభం లేకపోయింది. ఆ సంగతి నా మిత్రునితో చెప్పగా ఆయన నవ్వి ఊరుకున్నారు. తరువాత కొన్ని రోజులకు నాకు ఒక కల వచ్చింది. మాస్టర్ గారు స్వయంగా నాకు మద్రాసు లోనే ఉపదేశం ఇచ్చినట్ట్లు ఆ కల వచ్చిన రోజు తెల్లవారగానే మా ఇంటికి ఎదురుగా ఉన్న నారాయణ అయ్యర్ ఇంటికి వెళ్ళి నా కల గురించి చెప్పాను. “అంటె కుంభకోణం వెళ్ళకుండా తప్పించుకుందామనా?” అని నవ్వారు. అంతలో ఒక కారు వచ్చి గేటు దగ్గెర ఆగింది. ఆశ్చర్యం! మాస్టర్ గారు ఒక స్నేహితునితో కారు దిగుతున్నారు. మా ఆశ్చర్యానికి అవధి లేదు. నారాయణ అయ్యర్ గారి ద్వారా మాస్టర్ గారిని దర్శించి, ఆ రోజు, అనగా 10 అగస్టు 1916వ సంవత్సరం గురువారం, నా దృష్టిలో మంచి రోజు. ఉపదేశం ఇమ్మని అడిగాను. కాని మాస్టర్ గారు ఆ మరునాడు ఉదయం 8 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఉపదేశం పొందిన మూడవ రోజునే నాకు నమస్కారం వచ్చింది. ఉపదేశం పొందినప్పటి నుండి నాలో శక్తి ఎక్కువ కాసాగింది.  బరువు కూడా పెరిగింది. ఎంతో ఉత్సాహంతో నిత్యం సాధన చేస్తున్నాను. అప్పటి నుండి నా జీవన దృక్పథం మారిపోయింది. అంతా ఆనందమయం. నేను ఉపదేశం పొందిన మూడు రోజుల తర్వాత ఒకాయన పరుగున వచ్చి తన భార్యకు తేలు కుట్టిందని, చాలా ప్రమాదంలో ఉందని చికిత్స చేయమని ప్రార్థించాడు. మాస్టర్ గారు పక్కనే ఉన్న నా వైపు తిరిగి “శంకర వెళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చి రా” అన్నారు. “నాకు ట్రీట్మెంట్ పద్ధతి తెలీదు. మాస్టర్ నేను ఉపదేశం పొంది మూడు రోజులే అయ్యింది” అన్నాను. “పరవాలేదు వెళ్ళి ట్రీట్మెంట్ చెయ్” అని ఆజ్ఞాపించారు. ఆ వచ్చిన అతనితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన భార్యకు ట్రీట్మెంట్ చేసాను. నిమిషాలలో ఆమె బాధ తగ్గి లేచి కూర్చుంది. ఆ అనుభవం నాకు ఎంతో తృప్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. 

1916 డిసెంబర్, కుంభకోణంలో మాస్టర్ గారు సమావేశాలకు పిలుపు ఇచ్చారు. దాదాపు 200 మంది మీడియమ్స్ హాజరయ్యారు. అది ధనిష్ఠ నక్షత్రం రోజు. మాస్టర్ గారి జన్మ తార. అందరం అమిత ఉత్సాహంతో పండుగ చేసుకున్నాం. ఆ రోజున ఒక మీడియం పాశ్చాత్య సాంప్రదాయ రీతిలో పూలమాలలు తెచ్చి ముందు అమ్మగారి మెడలో వేశాడు. తరువాత మాస్టర్ గారి మెడలో పూలమాలలు వెయ్యాలని వస్తుండగా ఒక్కసారిగా కలకలం బయలుదేరింది.

అమ్మగారి శరీరం ఆపాద మస్తకం(fore-head) మంట పుట్టినట్టు కనిపించ సాగింది. వెంటనే మాస్టర్ గారు “ఆ మాల తీసి వేయండి. ముందు నాకు వెయ్యండి. అలా చేశాక ఇప్పుడు అమ్మకి వెయ్యండి” అని అన్నారు. అప్పుడు అమ్మగారిలో ఆ మంటలు చల్లారాయి. ఆ తరువాత చల్లగా హాయిగా ఉందట.

తరువాత కాసేపటికి ఒక సంగీత ఖచేరీ జరిగింది. విధ్వాన్.కంభంగుడి రామ స్వామి అయ్యంగార్ వారి గాత్ర కచేరి. ఆయనను సహజ రీతిలో ఒక కృతి పాడమన్నారు మాస్టర్ గారు. ఆ కృతి పాడిన తరువాత మాస్టర్ గారు ఆయనను కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. అప్పుడు మళ్ళీ పాడమన్నారు. అది త్యాగరాయ కృతి. అంతకు ముందు పాడిందే. అయ్తేనేం అయ్యంగారి మెడ నరాలన్నీ ఇంత లావుగా ఉబ్బరించాయి. చూస్తుండగానే మెడ లావయ్యంది. చాలా బాధపడుతున్నట్లు అందరికీ కనిపిస్తోంది. అప్పుడు పాడిన కృతి అత్యద్భుతం. సాక్షాత్ త్యాగరాజస్వామి అయ్యంగారిలో ప్రవేశించి ఆ కృతి పాడి వినిపించారు. తరువాత మాస్టర్ గారు అన్నారు “అది త్యాగరాజు పాడిన విధం, అది త్యాగరాయ కృతి”. మాస్టర్ గారి యోగశక్తి ఎన్ని అద్భుతాలు చేయగలదో ఆనాడు అందరూ గ్రహించారు. మాస్టర్ గారు అన్నారు “అవసరమైతే కుక్క చేత ఇంగ్లీషు మాట్లాడిస్తాను” అని.

ఆరోజు సాయంత్రం 6:00 గంటలకు ప్రార్థనకు కూర్చున్నాం అందరం. ధ్యానం పూర్తి అయ్యే వేళకు ఓ పెద్ద శబ్ధం వినిపించింది. ఏమిటంటే మరొక మీడియం కొన్ని సంవత్సరాలుగా కాలు నొప్పితో బాధపడుతున్నాడు, అతని కాలు ఎముకలు చక్కబడ్డాయి, లేచి వెళ్లి మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు.అలా అలా ఈ యోగంలో నాకు పరిపూర్ణ విశ్వాసం ఏర్పడింది.

తంజావూరు జిల్లా లోని నాగూరుకు(Nagore) వచ్చాను. అక్కడ మా అక్కగారు బావగారు ఉన్నారు. 1917 జనవరి సంక్రాంతి పండుగ రోజులు. నేను మామూలుగా సాయంత్రం 6 గంటలకు ప్రార్ధనకు ఉపక్రమించాను. ఏదో అనిర్వచనీయమైన శక్తి ధారగా నాలోకి ప్రవహించి రాసాగింది. దానిని భరించలేకపోయాను. నా ప్రయత్నం లేకుండానే లేచి నిలబడ్డాను. కళ్ళు మూతపడే ఉన్నాయి. నిలబడ్డవాడిని గిరగిరా బొంగరం లా తిరగసాగాను. కారణం అర్థం కాలేదు. ప్రయత్నించి నిగ్రహించుకోలేకపోయాను. కొన్ని నిమిషాల తర్వాత నా ఎదురుగా ఉన్న పూజా మందిరంలో భువనేశ్వరీ దేవి విగ్రహంపై ఉన్న పట్టు బట్టను లాగి వేశాను. అప్పుడిక నటరాజు వలె నాట్యం చేయసాగాను. నాలోకి శక్తి ప్రవహిస్తూనే ఉంది సాధన పూర్తి అయ్యే వరకు. నా చర్య గమనిస్తున్న అక్క గారు తర్వాత అడిగారు, “ఏమిటి ఈ పైత్యం?” అని. యోగంలో ఎలా ప్రవేశించిందీ చెప్పాను. ఆమెనూ మా బావగారిని ఈ యోగ సాధన చేయమని కోరాను. వారికి నా మాట పైన నమ్మకం కలగలేదు. మా అక్క అంది “దేవతలందరిలో భువనేశ్వరీ దేవి మహాశక్తివంతురాలు, ఆ దేవిని వదిలి నీ యోగం చేయడం మాకు ఇష్టం లేదు”. కొంతసేపు వాగ్వాదం జరిగింది మామద్య. నేనన్నాను “ఆ భువనేశ్వరీ దేవి స్వయంగా చెబితే ఒప్పుకుంటావా” అని. ఆమె సరేనంది. అప్పుడు అక్క నా ఎదురుగా కూర్చొని ఉంది. నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేయగానే అక్కలో ఏదో శక్తి ప్రవహించినట్లై వెల్లకిలా పడిపోయింది. “అమ్మ..తల్లీ..జగదీశ్వరి మాతా..పధ్నాలుగు ఏళ్ళుగా నిన్ను ఆరాధిస్తుంటె ఇప్పటికి కరుణించావా” అని ఆనందం పట్టలేక అరసాగింది. కొంత సేపటికి ఆమె మామూలు స్థితికి వచ్చింది. మరునాడు ఉదయం ధ్యాన సమయంలో మా అక్కతో అన్నాను, “అంబికా దేవి దర్శనం కోసం ప్రార్ధించి కళ్ళు మూసుకుని కూర్చో” అని. ఆ క్షణం కొన్ని రోజుల వరకు నాలోకి అపూర్వమైన తేజస్సు, శక్తి ప్రవహించి రాసాగింది. నా ప్రమేయం లేకుండానే నా చేతులు ఏవేవో వ్రాయసాగాయి. నా అనుభవాలన్నీ అక్కకు చెప్పేవాణ్ణి. నా చేయి ఏవేవో విషయాలను ఆటోమేటిక్గా రాసేది. సృష్టికి సంబంధించిన అనేక రహస్యాలు బయటపడ్డాయి. అక్క కళ్ళు మూసుకోగానే స్పృహ కోల్పోయేది. కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కనిపించేవి. వాటిని ఆమె ట్రాన్స్ లోనుండి చెబుతుండేది. మా మేనల్లుడు రికార్డు చేసేవాడు. నేను వర్ణించే విషయాలు ఆమె చూసే దృశ్యాలు ఒక్కటే అయ్యేవి. అలా ఒక వారం రోజులు సృష్టి మొత్తాన్ని, విశ్వాంతరాళాన్ని పర్యటించాం, పరిశీలించాం. ఆ వారం రోజులు దేవి అంబిక మా వెంట ఉన్నట్ట్లు అనిపించింది. మా అక్క, బావ అనుభవాలు అద్భుతంగా ఉండేవి. ఆటో రైటింగ్ లోనే అనేక మంత్రాలు చక్రాలు రాసేవారు. అదంతా భువనేశ్వరి మాత అనుగ్రహం అని వారు నమ్మారు. ఎన్ని దృష్టాంతాలు, నిదర్శనాలు కనిపించినా తమ మార్గం వదల లేకపోయారు. మా అమ్మగారిని అడిగాను ఈ మార్గంలోకి రమ్మని. ఆమె వెంటనే అంగీకరించారు. నేనే ఉపదేశం చేసాను. ఉపదేశం పొందిన రోజు నుండి ఆమె బ్రహ్మానందానుభూతి అనుభవించసాగారు. చివరి వరకు ఆమె ఈ మార్గంలోనే సాధన చేస్తూ వచ్చారు. మా అమ్మగారి విషయం,  నా అనుభవాలు వ్రాసి కుంభకోణం లోని మాస్టర్ గారికి పంపాను. అంబికా పటం ముందు కూర్చుని యోగ సాధన చేయవద్దని మాస్టర్ గారు సలహా ఇచ్చారు. నాగూరు నుండి మద్రాసు వచ్చాం. జార్జ్ టౌను లో నివాసం. మాస్టర్ గారు మద్రాసు వచ్చారు. మా అమ్మ గారిని వెంట తీసుకువెళ్యాను దర్శనానికి. అమ్మకు ఉపదేశం ఇమ్మని కోరాను. మాస్టర్ గారు నవ్వి, “మళ్ళీ ఉపదేశం ఎందుకు శంకర? నువ్వు ఇచ్చావు గా, అది చాలు” అని అన్నారు.

కొన్ని సంవత్సరాల తర్వాత భుజండర్ నాడీ లో నా జతకం చదివించినప్పుడు, అందులో ఈ సంఘటన చెప్పారు. నేను మా అమ్మగారికి ఉపదేశం ఇవ్వడం, తరువాత మాస్టర్ గారిని ఆమెకు ఉపదేశం ఇమ్మని కోరగా నేనిచ్చిన ఉపదేశం చాలని అనడం, నాడీ లో చెప్పారు. నాకు మాస్టర్ గారికి తప్ప మరొక వ్యక్తికి తెలియని రహస్యం. భుజండర్ నాడీ లో నమోదయి ఉంది నా విషయాలే కాదు, ఈ యోగా లైన్లో ఉన్న మీడియమ్స్ అనేకమంది జాతకాలలోని అద్భుత విషయాలు నాడీ గ్రంథాలలో ఉన్నాయి. మాస్టర్ గారితో అనేక సందర్భాలలో సన్నిహితంగా ఉంటూ వచ్చాను.

అది 1917  ఫిబ్రవరి, మాస్టర్ గారు ఉపదేశం చేసిన ఒక సంపన్నుడు, మద్రాసు నివాసి మాస్టర్ గారిని తన ఇంటికి ఆహ్వానించాడు. మాస్టర్ గారికి పాద పూజ చెయ్యాలని ఆయన కోరిక. మాస్టర్ గారు బయట వారిని ఎవ్వరిని ఆహ్వానించవద్దని నిరాడంబరంగా చేసుకోమని స్పష్టంగా చెప్పారు. మమ్మల్ని చెట్టియార్ ఇంటికి రమ్మని మాస్టర్ గారే చెప్పారు. మేము వెళ్ళేసరికి వాకిట నాదస్వరం వినిపిస్తోంది. బ్యాండ్ మేళం, డోలు, సన్నాయి..ఓహ్..పెళ్ళివారి ఇల్లు లా ఉంది. అలంకరణ, పాదపూజ చాలా ఆడంబరంగా ఆనందోత్సాహాలతో చేశాడు చెట్టియార్. లోపల ఇది జరుగుతుండగా బయట ద్వారం వద్ద ఒక ఉపాధ్యాయుడు వచ్చి నిలబడి, “ లోపల ఏమిటా హడావిడి?” అని ప్రశ్నించాడు. ‘గురుపూజ’ అని తెలిసి లోపలకు వచ్చాడు. మాస్టర్ గారిని చూడగానే ఆయనకు కళ్ళు తిరుగినట్ట్లైయ్యింది. ఆ క్షణంలో మాస్టర్ గారు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. వారిని గురించి, యోగం గురించి అడిగి తెలుసుకున్నాడు. ట్రిప్లికేను లో మాస్టర్ గారు బస చేసిన ఇంటి అడ్రస్సు చెప్పి అక్కడికి వెళ్ళి కలుసుకోమన్నారు. మేమంతా మాస్టర్ గారి సన్నిధిలోనే ఉన్నాం. రాత్రి 10 గంటలకు ఆ పెద్దమనిషి వచ్చి తనకు అప్పుడే ఉపదేశం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. వెంటనే మాస్టర్ గారు అతనికి ఉపదేశం ఇచ్చారు. ఆయన హైదరాబాద్ లో ఒక హైస్కూల్ లో ఒక సైన్స్ టీచర్. మాస్టర్ గారితో ఆ రాత్రి ప్రొద్దుపొడిచే వరకు ఏవేవో చరేచిస్తూనే ఉన్నాడు. మాస్టర్ గారు ఓర్పుగా సమాధానాలు ఇచ్చారు. మరునాడు ఉదయం ఆయన మింట్ స్ట్రీటు మొదట్లో ఉండే వృద్ధ సాధువును కలుసుకున్నాడు. ఆయన సిద్ధుడు. 10 సంవత్సరాల క్రితం ఒకసారి ఈయన ఈ సాధువును కలుసుకుని తనకు ఏదన్నా తరుణోపాయం చూపమని అడిగాడట. ఆయన పదేళ్ల తర్వాత వచ్చి కలుసుకోమన్నారు. మళ్ళీ ఆయన్ని రోజు సాయంత్రం వచ్చి కలిసాడు.  నిన్న ఆ సాధువు “మా అన్నగారి దగ్గరికి వెళ్ళు” అన్నాడట. ఆయన అన్న గారు ఎవరో ఈ పంతులయ్యకు తెలియదు. అలా వీధిలో తిరుగుతూ ముందు మాస్టారు గారి పాదపూజ జరుగుతున్న చెట్టియార్ ఇంటి గుమ్మం ముందు ఆగాడు. ఆ తర్వాత జరిగిందిది. ఆ రాత్రే అతనికి మాస్టర్ గారి ఉపదేశం ఇవ్వడంతో ఆనందం పట్టలేక కృతజ్ఞతలు చెప్పుకుందామని ఉదయమే ఆ సాధువును వెళ్ళి కలిసాడు. ఈ పంతులయ్యను చూడగానే సాధువు మండి పడ్డాడు. నిన్ను ఆయన దగ్గెరకు పంపింది నీ మేలు కోరి. “పెద్ద పండితుని లాగా ఆయనతో వాదిస్తావా? మూర్ఖుడా..ఆయన ఎవరో తెలుసా? సాక్షాత్ పరబ్రహ్మం” అని కోప్పడ్డాడు. “ఇకపైన ఎప్పుడూ ప్రశ్నించకు. ఆయన చెప్పినట్లు చెయ్యి”. ఆ పెద్ద మనిషి మళ్ళీ మాస్టారు గారి దగ్గెరకు వచ్చి జరిగినదంతా పూస గ్రుచ్చినట్ట్లు చెప్పాడు. మాస్టర్ గారు నవ్వి, “నాకొక తమ్ముడున్నాడా? మంచిది!” అన్నారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఆ పంతులు గారి జాతకం భుజండర్ నాడీ లో చదివిచినప్పుడు ఈ కథ యావత్తు అందులో చెప్పబడింది. 

1918 లో జరిగిన సంఘటన. మాస్టర్ గారి అల్లుడు నాకు స్నేహితుడు.  ఏదో మాట్లాడుకుంటుండగా చెప్పాడు. మాస్టర్ గారు తనను సెలవు పెట్టి వచ్చి కుంభకోణంలో ఉండమన్నారని. “లేకపోతే నీ జీవితానికే ప్రమాదం” అని హెచ్చరించారట. ఆయన ఆ మాట వినలేదు. మాస్టర్ గారన్నారట, “నీ కోసం కాకపోయినా నా కూతురి క్షేమం కోరి చెబుతున్నాను విను” అని హెచ్చరించారు. అయినా అల్లుడుగారు వినలేదు. ఆయనకు మామగారి మహత్తు పైన నమ్మకం లేదు.

1918 జులై 23, శుక్రవారం సాయంత్రం మాస్టర్ గారు శుక్ర గ్రహాన్ని అదుపులకి తీసుకోవాలని, దాని ద్వారా యోగ ఫలాన్ని భూమిపైకి అవతరింపజేయ్యాలని సంకల్పించారు. టెలీఫోన్ శబ్ధాల వంటి ధ్వనుల ద్వారా శుక్ర గ్రహానికి సందేశాలు పంపారు. టెలిగ్రాఫిక్ తరంగాలుగా జవాబులు అందుకున్నారు. నూతన యోగ మార్గాన్ని భూమికి ఏర్పరచమని మాస్టర్ గారు శుక్ర గ్రహాన్ని అర్ధిస్తే అది విముఖత చూపింది. యోగా స్కూల్ ఆవరణలో సాయంత్రం సాధనకు మీడియమ్స్ అంతా సమావేశం అయ్యారు. మాస్టర్ గారు ఒక క్రొత్త కోర్సు ఇచ్చారు. అందులో చివరి మాటలు ‘ఎల్లో ఫ్లవర్స్ ఎలక్ట్రిక్ ఫాల్స్’ అని జ్ఞాపకం. అది శుక్రుడిని అదుపు చేయడానికి మాస్టర్ గారు సృష్టించిన మంత్రం. మేము ఆ కోర్సు ప్రాక్టీస్ చేస్తుండగానే, దగ్గెరగా ఉన్న కావేరి నది వంతెన పై నల్లని మేఘం కమ్మింది. పిడుగు పడి వంతెన పగులిచ్చింది. అంటే విద్యుత్ ఘాతం తగిలి మాస్టారు గారికి తల వంచినట్లైయ్యింది. ఆ రోజు నుండి ‘శుక్ర రీడింగ్’(Sukra Reading) పని ప్రారంభమయ్యింది. ఆ మరునాటి ఉదయం మద్రాసు లో ఉన్న మాస్టర్ గారి అల్లుడు(ప్రభుత్వ ఉద్యోగి) మరణించాడు. ఎంత వైద్య సహాయం అందించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన అంత్యక్రియలకు నేను హాజరయ్యాను. ఈ సంఘటన గురించి కూడా నాడీ గ్రంథాలు పేర్కొన్నాయి. మాస్టర్ గారు, అశురాచార్యుడైన శుక్రాచార్యుని ఈ యోగ మార్గం భూమికి అందించమని కోరారు. ఆయన తిరస్కారంతో  మాస్టర్ గారు ఎంతగా కుమిలిపోయారో మాటలలో వర్ణించడం అసాధ్యం. శుక్రుడు ఎంత వేగంగా అందుకు అంగీకరించాడో అంత వేగంగాను ఈ యోగ క్రియ పూర్తి అవుతుంది. మాస్టర్ గారికి తెలుసు తన అల్లుడికి రానున్న ప్రమాదం.

1918 సెప్టెంబర్, మాస్టర్ గారు మద్రాసు వచ్చారు. సాధారణంగా మద్రాసులో ఉన్నన్ని రోజులు ట్రిప్లికేను లోనే ఉండేవారు. వారికి పాద పూజ చేసిన చెట్టియార్ మాస్టర్ గారి ఖర్చులన్నీ భరించేవాడు. తరువాత ఎవరి మాటలో విని మాస్టర్ గారిని కలుసుకోవడం తగ్గించాడు. మాస్టర్ గారు కుంభకోణం తిరిగి వెళ్ళే రోజు మేమంతా వీడుకోలు చెప్పడానికి ఎగ్మోర్ స్టేషన్ కు వెళ్ళాం. అందరం బోగీ బయట ఉన్నాం. చెట్టియార్ తల కిటికీలో నుంచి లోపల పెట్టి మాస్టర్ గారిని పలకరించాడు. మాస్టర్ గారు, “చెట్టియార్..డబ్బు ఈ రోజు వస్తుంది పోతుందయ్యా..డబ్బుతో బ్రహ్మాన్ని కొనలేవు” అన్నారు. రైలు కదలి వెళ్ళిపోయింది. ఆ మాటలు మననం చేస్కుంటూ ఇళ్ళకు తిరిగి వచ్చాం. చెట్టియార్ నూలు వ్యాపారంలో లక్షలు గడించాడు. కొన్ని సంవత్సరాలకు వ్యాపారం దివాళా తీసి కటిక దరిద్రంతో కన్ను మూశాడు.

1919లో ఒక మీడియం చనిపోయాడు. ఆయన మాస్టర్ గారికి ఆప్తుడు. ఆయనే జ్ఞానదృష్టితో సాధకుల పూర్వ జన్మలు, దేహ మానసిక స్థితులు తెలుసుకుని మాస్టర్ గారికి తెలియజేస్తూ ఉండేవాడు. మాస్టర్ గారే ఆయనకు ఆ శక్తులు ప్రసాదించారు. ఒకరోజు కొందరు మీడియమ్స్ “అయ్యో C.R. వెళ్ళిపోయాడు, ఇంక మనకు దిక్కెవరు?” అని విచారిస్తుండగా, మాస్టర్ గారు అటు పోతూ ఆ మాటలు విని, “పోతే యేం? పోయినవారికి ఉన్నవారికి నేనే దిక్కు. పోయిన వారు ఎక్కడికి పోతారు? తల్లి గర్భం నుండి వచ్చి జగన్మాత గర్భంలోకి వెళ్ళిపోతారు. అవసరమైతే మళ్లీ పిలిపించుకోవచ్చు, బెంగపడకండి” అని హెచ్చరించారు.

1919 ఆగస్టు 24, మా అందరికి పిలుపు వచ్చింది. కుంభకోణం రమ్మని. ఆ రోజు ‘మార్స్ లీడింగ్ కోర్స్’(Mars Leading Course) చెయ్యిస్తానన్నారు. అంటే అంగారక గ్రహాన్ని అదుపులోనికి తీసుకురావడం. తెల్లవారుఝామునే లేచి కావేరిలో చన్నీటి స్నానం చేసి నాలుగు గంటలకల్లా సిద్ధం కావాలి. ఒక వయో వృద్ధుడు చన్నీళ్ళు పోసుకోలేనని, వేణ్ణీళ్ళు కావాలని అడిగాడు. “కావేరిలో చన్నీళ్ళలో స్నానం చేయగలవారే ప్రేయరుకు రండి, మిగితావారు రాకండి” అని కఠినంగా శాశించారు. ఫలహారం చేయకుండా ప్రార్థన చేయకూడదు కదా.. ఏదో హోటలులో మాట్లాడి  మూడున్నరకల్లా టిఫిన్ కాఫీ వచ్చే ఏర్పాట్లు చేసి పెట్టారు. నాలుగు కొట్టేసరికి కుజ గ్రహానికి లింక్ ఇచ్చారు. లింక్ పేరు ఉచ్ఛరించగానే, నా వెన్నుపూస లోహం కరిగి పూత పోసినట్లు శక్తి ప్రసారంతో వేడెక్కిపోయింది. ప్రాక్టీస్ పూర్తి అయిన తరువాత ఆ శక్తి తగ్గింది. అందరికి అలాంటి అనుభవమే కలిగింది. ఆ రోజు సాయంత్రం మాస్టర్ గారు మా అందరినీ హాలు లో సమావేశపరిచి, “ఈ రోజు నుండి నేనే మంత్ర దేవతను. ఎవ్వరూ ఎలాంటి మంత్రాలూ ఉపాసంచనవసరం లేదు. తావీజులు రక్షా బంధాలున్నవారు వాటిని కరిగించి ఇంకేమైనా నగలు చెయ్యించుకోండి. ఎవ్వరినీ ఇంక ఎలాంటి దుష్ట శక్తులూ ఆవహించవు” అన్నారు.

1919 లోనే జరిగిన సంఘటన ఇది. మరొక సాధకుడు, ఆయన మునిసిపల్ ఆఫీసులో పని చేస్తున్నాడు. అప్పట్లో మేమంతా ఒక ముఖ్యమైన కోర్సు ప్రాక్టీసు చేస్తున్నాము. మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆపకూడదని నిబంధన. ఆయన పై అధికారి దుర్బుద్ధితో ఈయనను బదిలీ చెయ్యించాడు. ఆయన ట్రాన్స్ఫర్ ఆర్డరు తీసుకుని మాస్టర్ గారి దగ్గెరకు వచ్చి మొత్తుకున్నాడు. మాస్టర్ గారు ఒక క్షణం సేపు కళ్ళు మూసుకుని “ నీకు ట్రాన్స్ఫర్ జరగలేదులే” అన్నారు. ఎలా నమ్మడం? అతను వారం రోజుల్లో వెళ్లి చేరాలి. నాలుగు రోజులు తర్వాత ఆయన పై అధికారి, ఇంటి మరమ్మత్తుల కొఱకు స్వగ్రామం వెళ్ళాడు. ద్వారం పైన కాంక్రీట్ పోసి ఉంది. ఈయన తనిఖీ చేస్తుండగానే, అది విరిగి నెత్తిన పడి మఱనించాడు. మా యోగ మిత్రుని ట్రాన్స్ఫర్ ఆగిపోయింది.

అలాంటిదే మరొక సంఘటన కుంభకోణం లోనే జరిగింది. అతను సాధకుడే. ఇంట్లో ఏదో గొడవ జరిగి భార్యను కఱ్ఱ తీస్కుని బాదాడు. మనస్సు వకలమై యోగా స్కూలుకు వచ్చాడు. మాస్టర్ గారు ద్వారంలో నిలబడి, అతన్ని లోపలకి రానీయకుండా ఆపి, “ఏం పని అది? సిగ్గు లేదూ? వెళ్ళి క్షమాపణ చెప్పి రా” అతను మాస్టర్ గారి కాళ్ళ మీద పడి, భోరున విలపించి క్షమాపణ కోరాడు.

మాస్టర్ గారికి మంచి స్నేహితుడు ఒకాయన..మాస్టర్ గారి ఇంటికి ఎదురు ఇల్లే. ఒక రోజు 12 అయ్యేవరకు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. 12 కొట్టగానే మాస్టర్ గారు అన్నారు “మిత్రమా ఒక పని చెబుతాను చేస్తావా?”. ఆయన గౌరవంతో సరే అన్నారు. ఇప్పుడు నీకు ఉపదేశం ఇవ్వాలి. అతనికి ఏమి అర్ధం కాలేదు. వేళా పాళా లేదా ఉపదేశానికి అనుకున్నాడు. అయ్నా మాస్టర్ గారు చెప్పినట్ట్లు కళ్ళు మూస్కుని కూర్చున్నాడు. అతని కళ్ళ ముందు కాంతి ప్రవాహాలు, తేజో మండలాలు. అతని ఆనందానికి అవధి లేకపోయింది. మాస్టర్ గారికి ఎవరిపై ఎప్పుడు అనుగ్రహం కలిగేదో చెప్పలేం కద.

1921 డిసెంబర్, సమావేశానికి దాదాపు 200 మంది సాధకులు హాజరయ్యారు. ఆంధ్రా నుండి వచ్చిన మిత్రులు ఖద్దర్ బట్టల్లో కాంగ్రెస్ వారు అనిపించారు. వారు గాంధీజీ గురించి తీవ్రంగా చర్చిస్తుండగా,  మాస్టర్ గారు కల్పించుకుని, “ఫ్రెండ్స్..ఇది రాజకీయ వేదిక కాదు. కేవలం ఆధ్యాత్మిక కేంద్రం. గాంధీజీ మీకు ఇవ్వదలచిన స్వరాజ్యం సమగ్రమైంది కాదు. నేను మీకు ఇచ్చేదే సంపూర్ణమైన స్వతంత్రం. దాని తేడా మీకు తర్వాత గాని తెలియదు. నేనేదో కుంభకోణం చేస్తున్నానని కొందరు అంటున్నారు. నేను కుంభకోణమే కాదు మాయావరం చేయగలను”.

ఈ యోగం పూర్తి కావడానికి ఇంకెంత కాలం పడుతుంది, అని ప్రశ్నిస్తే, మాస్టర్ గారు అన్నారు,” నాకే తెలియదు ఎంతకాలం పట్టేది. అయితే ఇది సత్య యోగం కనుక విఫలం కావడం జరగదు. కనీసం ఒక మీడియం అయినా నా మార్గం అనుసరిస్తే ఈ లైను పూర్తవుతుంది.

భగీరధుడు గంగను భూమికి తెచ్చినట్లు, నా ప్రయత్నం విజయవంతం అవుతుంది. ఇక నిర్భయంగా నిశ్చింతగా వెళ్లి, మాస్టారు గారి శిష్యులమని చెప్పుకోండి. తరువాత సమావేశం ఎప్పుడో మీకే తెలుస్తుంది” అన్నారు. ఎందుకో ఈ సారి కుంభకోణం వదిలి రావడం అంటే బాధ అనిపించింది. తండ్రిని వదిలి వెళ్ళిపోయే బిడ్డ వలె మా మనస్సులు రోధించాయి. మాస్టర్ గారు మాకు తండ్రి కాదు. అంతకన్నా ఎక్కువ. అన్నీ ప్రసాదించారు. అడిగినవీ అడగనివీ కూడా.

1922 జనవరి, మాస్టర్ గారు ఒక సిష్యుణ్ణి పిలిచి రిజిస్టర్ తెమ్మన్నారు. ఆ రిజిస్టర్ లో మీడియమ్స్ వివరాలు ఉంటాయి. ”చివరి మీడియం కు ఇచ్చిన సంఖ్య 748, ఔనా?” అని అడిగారు. తరువాత నంబరు ‘749 బి’(749 B)కి ఇవ్వు, అతను తండ్రి కన్నా ఏడు రెట్లు గొప్పవాడు”. రిజిస్టరు చూస్తే అతని తండ్రి నెంబరు 107. మాస్టర్ గారు అంతా గణితం ప్రకారం చేసేవారు. మొత్తం 752 మందికి ఉపదేశం ఇచ్చారు. 616 మంది మగవారు, 136 మంది ఆడవారు. ప్రతి వ్యక్తి మార్కండేయ మహర్షి వలె కావాలని, పరమేశ్వరుని వరాలు పొందాలని అంతరార్ధం.

1922 మే 12న సాయంత్రం 3 గంటలకు మాస్టరు గారు గుండెపోటు వచ్చి భౌతిక శరీరాన్ని వదిలిపెట్టారు. అప్పట్లో మాకు అంధకార మయం. దోవ, తెన్ను కనిపిచలేదు. వృద్ధ సాధువు సలహా ప్రకారం, వచ్చి ఉపదేశం పొందిన హైదరాబాద్ అయ్యవారు మాస్టర్ గారి పక్కనే ఉండి ట్రీట్మెంట్ ఇచ్చాడు. అయినా లాభం లేకపోయింది. మాస్టర్ గారి అనుగ్రహంతో పొందిన శక్తులతో వారికే ట్రీట్మెంట్ ఇవ్వడమేమిటి? నావికుడు లేని నౌకలో మేము ప్రయాణం చేయసాగాం.

ట్రిప్లికేను లో మేము సమావేశం అయ్యాం. నేను సూచన చేసాను, ‘అందరం కళ్ళు తెరుచుకునే సాధన చేద్దాం..యధాపూర్వకంగా నమస్కారం వస్తే ఈ యోగం కొనసాగిద్దాం’. అందరికి నమస్కారం వచ్చింది. ఎవ్వరము యోగం వదలలేదు. 13వ రోజున భుజండర్ నాడీ మమ్మల్ని ఆదుకుంది. ఇంకా అనేక నాడీ గ్రంధాలు చదివించాం. అన్నిటిలో ఉన్నది ఒక్కటే. ఈ యోగ ప్రవక్త సాక్షాత్తు పరబ్రహ్మం, తన సృష్టిలోని లోపాలు పరిహరించడానికి తానే ఈ అవతారం ధరించాడని. ఆయన తిరిగి వస్తారు. వచ్చేముందు మనకు తెలుస్తుంది.










శ్రీ T.S. శంకర్ ఐయేర్ 

(Medium No. 350)



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?