శ్రీ పోతరాజు నర్సింహం గారి నోట్స్ - ఉపోద్ఘాతం(Introduction Part 01)



శ్రీ పోతరాజు నర్సింహం గారి నోట్స్ - ఉపోద్ఘాతం(Introduction Part 01)

డాక్టర్ శ్రీ గాలి బాలసుందరరావు గారు


కుంభకోణంలో మాస్టరు సీ. వీ. వీ. నూతనయోగం స్థాపించారు. 

ప్రారంభ దశలో కొన్ని పరీక్షలు చేసి వారి వారి పూర్వజన్మ సంస్కారాదులను గురించి వివరములను సేకరించి ఉపదేశము చేశారు. వారి ఉపదేశ విధానమును ‘ఇనిషియేషను’ అంటారు. 

ఆ యోగాదర్శములు ఈ పుస్తకములో వివరింపబడ్డవి. ఈ నూతన యోగ మార్గమును ‘నూతన యోగమని “భృక్తరహిత తారక రాజయోగమనీ” అతీత కాయ కల్పయోగమనీ అంటారు. 

ఈ నూతనయోగాదర్శములు పూర్తిగా సాధింపడకుండానే మాస్టరు గారు. . . 12-6-1922 సాయంత్రం 3 గంటలకు భౌతిక దేహమును విసర్జించారు. 

వారు స్వయంగా 752 మందిని ఇనిషియేట్ చేశారు. 

వారిలో 

కుంభకోణం వాస్తవ్యులు శ్రీ యస్. ఆర్. బి. వి. గారు, 

ఒంగోలు వాస్తవ్యులు మైనంపాటి నరసింగరావు గారు, 

పండిత కవులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు 

నాకు తెలిసినంతవరకు యీ నూతన యోగమును గురించి ప్రచారం చేశారు.

మాస్టరుగారు భౌతిక దేహమును విసర్జించిన తరువాత వారి శిష్యులను మూడు వర్గాలుగా విభజించ వచ్చును. 


మొదటి వర్గము “ఉపదేశార్హత, మాస్టరు గారి నామార్హత ఒక్క మాస్టరు సీ.వీ. వీ. కే ఉన్నదనీ వారు యేదో సంకల్పంతో భౌతిక దేహం విసర్జించినా యోగ విధానము పరిపూర్ణము కావడానికి అవసర మైన మార్పులు విశ్వంలో యేర్పడగానే తిరిగి నిజ భౌతిక రూపంతో భూమిపై అవతరిస్తారనీ అంతవరకు యీ యోగవిధానమును ప్రచారం చేయకుండా అజ్ఞాతంగా అభ్య సిస్తూ ఫలితములను గమనిస్తూ ఉండడమే”ననీ విశ్వసించేవారు.


రెండవ వర్గంవారు కొన్ని సంవత్సరములు అభ్యాస ఫలితంగానో మాస్టరుగారి ఆదేశం వల్లనో తమకే మాస్టరు పదవి లభించిందనీ ఉపదేశార్హత కలిగిందనీ నమ్మి ప్రార్థన వాక్యంలో మాస్టరు . . . అన్న అక్షరముల తరువాత తమ నామాక్షరములను చేర్చి శిష్య కోటిని తయారుచేసుకున్నవారు. కుంభకోణ వాస్తవ్యులు అయిన యన్. ఆర్. బి.వి. గారు, ఒంగోలు వాస్తవ్యులైన మైనంపాటి నరసింగరావుగారు యీ శ్రేణికి చెందినవారు.


మూడవరకం ప్రారంభంలో కేవలం కుతూహలంతో, సందేహంతో, ఉపదేశా-నంతరం ప్రయత్నం లేకుండానే నమస్కారం ఎల్లా వస్తుందో చూద్దామని వెళ్ళి, ఆ అనుభూతిని అనుభవించి, శరీరంలో యిన్ని మార్పులు తెచ్చే యీ యోగ మార్గము గొప్పదనీ యీ యోగ విధాన సృష్టికర్త  అయిన మాస్టరు సి. వి. వి. మహత్తర శక్తి సంపన్నుడనీ విశ్వసించి యోగాభ్యాస కాలంలో కలిగే అనుభూతులను, ఆధునిక వైజ్ఞానిక సత్యావిష్కరణలతో పోల్చి, వాటి ఏకత్వమును గ్రహించి, యీ యోగ విధానం పరసు వైజ్ఞానికమని విశ్వసించి అభ్యసించేవాళ్లు.


మాస్టరు సీ. వీ. వీ. చే ఇనిషియేట్ కాబడిన మీడియములలో కీ.శే. పోతరాజు నరసింహము గారు యీ శ్రేణికి చెందినవారు. తనకు అనుభూతం కానిదాన్ని తనకు నమ్మకం కలిగించనిదాన్ని లౌక్యానికై వారెన్నడూ అంగీకరించేవారు కారు.


కీ.శే. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి ద్వారా వారి పరిచయ భాగ్యం నాకు లభించింది. మన కనుభూతం కాని వెన్నో విశ్వంలో వున్నవి. అవి లేవనడం అవివేకము; అవైజ్ఞానికము పంతులు గారు తాము విన్నది సత్యమో ఆసత్యమో ప్రయోగ రీత్యా, అనుభవరీత్యా నిరూ పించబడేవరకు సత్యాన్వేషణ దృష్టితో పరిశీలించేవారు. ఆ దృష్టితోనే సర్వదేశ తాత్విక గ్రంథాలు చదివేరు.


వివిధ పుష్పములలో మకరందమును తుమ్మెద సేకరించినట్లు వివిధ మత గ్రంథములలో సారమును గ్రహించి తమకు విశిష్టమైన తాత్విక దృష్టినీ వైఖరినీ యేర్పరచుకున్న వారు. ఆంధవిశ్వాసములకు మూఢాచారములకు వారి వద్ద తావేలేదు. తమ మిత్రులు యస్. నారాయణ అయ్యర్ గారి ద్వారా యీ యోగమును గురించి తెలుసుకుని మాస్టరు సీ. వీ.వీ.ని కలుసుకుని యీ యోగమును గురించి అడిగినప్పుడు మాస్టరుగారన్నమాటలను వారు డైరీలో వ్రాసి వుంచారు.


నేను నూతనా'న్ని శాశ్వతం చేయడానికై నేను ప్రయత్నిస్తున్నాను. నీకు విశ్వాసముంటే నువ్వూ ప్రయత్నించు” అన్నారట మాస్టరు. 


ఆ మహనీయుడి వినయ సంపన్నత వారిని ఆకర్షించింది. వారు యోగ మిత్రమండలిలో చేరారు.
శ్రీ యన్. ఆర్. బి. వి. గారి వద్ద “భుజండర్ నాడీ” అనే జ్యోతిష గ్రంథము వుండేది. అది అతి పురాదనమైనది, అందులో మాస్టరుగారి జాతకం మీడియముల జాతకములు ఉన్నవి. అది కొంతవరకు విని మాస్టరుగారు “ఇక మీదట మీడియములు ఈ గ్రంథం గానీ, యిటువంటి గ్రంథములు గానీ చదువగూడద” ని ఆజ్ఞాపించారట. 

అందుకు కారణము చాలా ఉన్నవి. 


ఇంతవరకు నడుస్తున్న విశ్వ కార్యక్రమము అధిదేవత, దేవత, గ్రహ, నక్షత్ర, గోళారుల వలన విభేదముల మీద ఆధారపడి ఉన్నది. 


గ్రహచారముల మధ్య భేదము ఉన్నంతవరకు, గ్రహముల నుండి ఉనికిగన్న (ప్రస్తుత మానవుని భౌతిక దేహము కూడా ఈ గ్రహాల అణువుల ద్వారా నిర్మితమైనదే ), లగ్నములు గ్రహనక్షత్రములు, మానవ జీవితంలో ఒక మానవ జీవితమేమిటి? ఉనికిలో ఉన్న ప్రతి వస్తువు విషయంలోనూ వైవిధ్యం ఏర్పరుస్తూనే ఉంటవి.


గ్రహముల మధ్య మిత్ర శత్రుత్వములతో వ్యక్తుల మధ్య స్నేహ | విరోధములు ఏర్పడుతూనే ఉంటవి.


జీవిత విధానం మారాలంటే గ్రహ గోళాదులలో మార్పులు జరగాలి. ప్రస్తుత పరిణామగతికి భంగంలేకుండా సృష్టి విధానంలో మార్పు కలిగించదలచుకున్న మాస్టరు ఈ సంగతి గ్రహించి గ్రహ స్వభావ, శీలములను మార్చదలచి Planetary Courses కల్పించారు.


అవి ఎంతవరకు గ్రహ గోళములకు మార్చినవి?” అన్నది ఖగోళ శాస్త్రజ్ఞుల తదుపరి పరిశోధనల వలన తెలుసుకోవలసిన విషయము.


శుక్ర గ్రహములో కొన్ని మార్పులు జరిగినవని ఖగోళ శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. ఆ విషయములు విపులీకరించడానికి వేరే గ్రంథం వ్రాయవలసి ఉంటుంది.


నాడీ, హోరా శాస్త్రాది జ్యోతిష గ్రంథములు కలియుగ ఆరంభములో వ్రాయబడినట్లు తోస్తుంది. 
ఆనాడు ప్రచారంలో ఉన్న రాశి శీల, గ్రహ శీలములను బట్టి ఆ గ్రంథములు, రచనాకాలము నుండి కొన్ని వేల సంవత్సరముల వరకు కొన్ని ఆయనాంశ(astrological term), అక్షాంశముల మధ్య జరిగే మానవ జన్మ విశేషములను ఆ సూచనలో వున్న నిజానిజములు వివరములు గ్రహశీలముల స్థిరత్వము మీద ఆధారపడ్డవి.


వాటిని ప్రకాశించే మహత్తర శక్తి ఏదో వాటిని మారుస్తున్నప్పుడు ఆ పాతకాలపు జ్యోతిశ్శాస్త్ర సూత్రములు, వాటి ననుసరించి, నిర్ణయించిన ఫలితములు వ్యత్యాసముతోను, విరుద్ధంగాను ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చును.


గ్రహగతులను మార్చదలచుకున్న మాస్టరు తన జాతక విషయంలో చెప్పిన ఫలితములను విశ్వసించి మీడియములు ఆవిశ్వాసమును ఏర్పరచు కోకుండా ఆ విధంగా శాశించి ఉంటారు.


రెండవ కారణము
: ఈ గ్రంథములు భూర్జర పత్రము(Bhoj Patram) మీదనో, తాళ పత్రముల మీదనో వ్రాయబడ్డవి. కాలక్రమాన అవి శిధిలములు కాగా, మళ్ళీ తరువాత తరముల వారిచేత తిరిగి వ్రాయబడినప్పుడు అనేక అక్షర లోపములు, అన్యాక్షర లేఖనము జరిగి అర్థవ్యత్యాసములు వచ్చి కలవరము కలిగించి ఉంటవి.


మూడవ కారణము ప్రజలకు ఈ గ్రంథములపై ఉన్న విశ్వాసమును, భక్తిని పురస్కరించుకుని ఈ శాస్త్రము అసలే లేకుండానో, కొన్ని భాగములు ఉండి, కొన్ని భాగములు లేకుండానో, ఉన్నవారు తమకు తెలిసినదానిని బట్టి, జరిగినదానిని బట్టి, తెలియనిది జరుగనున్నది ఊహాగానము చేసి చెప్పడం వల్లనో, ఈ శాస్త్రమునకు - దుష్ట్యాతి(అపఖ్యాతి) యేర్పడి ఉంటుంది.
 ఇలా చేసేవారిని నేను యెరుగుదును.


అసలు నాడీ హోరాలే నమ్మదగినది కాదనుకోవడం పొరపాటు శ్రీ యన్. ఆర్. వి. వి. గారే మాస్టర్ సాన్నిధ్యంలోనే రుజంతర నాడీ చదువుతూ “అం కట్టన్” అనడానికి బదులు, “అం బట్టన్” అని చదివారట. 


అంబట్టన్ అంటే ఆరవంలో “మంగలి”. ఇటువంటి అనివార్య లోపములు ఉన్నందువల్ల మాస్టరుగారు అట్లా ఆదేశించి ఉండవచ్చు.


సాధారణ జ్యోతిష్కులు మహాపోతే “త్రిశాంశ” వరకు పోయి ఫలితములు చెప్తారు. 


నాడీ జ్యోతిషం అలా కాదు. అది సెకండులో ఆరవయ్యో భాగము వరకుపోయి కొన్ని ఫలితములను నిర్ణయిస్తుంది. 


ధృవవాడి, భుజండర్ నాడి హోరాశాస్త్రము రచించిన ఋషులో ఋషులని పేరు పెట్టుకుని రచించిన వారో, మారిన, కాలక్రమాన మారుతున్న, గ్రహగతుల ననుసరించి - కొందరు మహా పురుషుల జాతకములు రాసినట్లు కనిపిస్తుంది.


మాస్టరుగారు భౌతికదేహ పరిత్యాగం చేసిన తరువాత శ్రీ పోతరాజు నరసింహం పంతులు గారికి మాస్టరుగారు చెప్పిన “మరణ రాహిత్యం అన్న మాటకు “బౌతిక దేహ మరణ రాహిత్యం” అని అర్థం కాదనీ, ఈ యోగం ఒక దివ్య శరీరాన్ని కల్పిస్తుందని ఆ శరీరానికి ఆకలి దప్పులు, జరా మరణములు, ఉండవు అనే అభిప్రాయం ఏర్పడింది.


మాస్టరుగారు ఈ యోగ సమావేశ కాలములో చెప్పిన వివరణలు, ఉప న్యాసములు, ఛలోక్తులు, సేకరించిన మీడియముల Notes తప్ప, కొత్తగా ఈ యోగమును గురించి తెలుసుకో దలచుకున్న వారికి ఏ ఆధారము ఉండేది కాదు.


మాస్టరుగారి జీవిత కాలంలో ఈ యోగ మార్గము ప్రయోగావస్థలోనే ఉందని (Experimental Stage) అయినా ఈ యోగ విజయం తధ్యము అని అంత వరకు ఎవరూ దీని విషయమై ప్రచారము చేయటం కాని ఈ యోగమును గురించి ఉపన్యాసములు ఇవ్వడం కాని, వ్యాసములు రాయడం కాని చేయకూడదని కఠి నంగా ఆదేశించారు.


అల్లా చేసిన వారిని గట్టిగా మందలించారు.


ఆ భాగములు ప్రచురించాలన్న కోరికతో మిత్రులు శ్రీ శివలెంక శంభుప్రసాద్ దయతో కొన్ని వేల కాపీలు అచ్చువేయించారు కూడా: 
కానీ, ఆ రాత్రి "ఇప్పుడు కాదని" ఆదేశం వచ్చింది. అందువలన విరమించుకున్నాను.
హోరా శాస్త్రంలో “నిశ్శబ్ద సంభాషణ” విధానంతో “మూల గురుపు” (మాస్టరు) అనేక సందేహములను నివారిస్తారని ఉన్నది. అటువంటి అనుభూతి కలుగుతూనే ఏ పనిగాని అడిగి ఆజ్ఞను పొందేవరకు చేయకుండా ఉండడము నాకు పరిపాటి అయిపోయింది. 

వీలైనంతవరకు వారి అభిప్రాయములే స్ఫురించేలాగున భాషాంతరీకరణము సాగించాను.
అవసరమైన చోట్ల వారు ఉపయో గించిన ఇంగ్లీషు పదములనే బ్రాకెట్లలో ఉదహరించాను. 
తెలుగుభాష తెలియనివారి ఉపయోగార్ధమై ఇంగ్లీషు వ్యాసమును, యథాతథంగా వేరే పుస్తక రూపంలో ప్రచురిస్తాము.

అయినా, కొంత మంది పుస్తకములు వ్రాయడము, నాడీ ఫలితాలు పేపర్లో వేయడం, సాగించారు.


The New Yoga అన్న పేరుతో శ్రీ ఎస్. నారాయణ అయ్యరగారు ఇంగ్లీష్ లో ఒక చిన్న పుస్తకమును ప్రచిరించారు.


శ్రీ పోతరాజు నరసింహం పంతులుగారు అనేక వ్యాసములను కొన్ని సంవత్సరముల క్రిందనే వ్రాసి, ప్రచురించకుండానే అట్టి పెట్టారు.


ఇల్లాగే శ్రీ పోతరాజు నరసింహం పంతులుగారు యోగ కాలంలో తమకు వచ్చిన ఆదేశములను, అనుభూతులను రోజువారీగా స్వహస్తంతో ఉద్దేశించి ఉంచిన మాస్టరుగారి డైరీలను కూడా ఎవరికి చూపకుండా జాగ్రత్తగా రహస్యంగా, పదిల పరిచి ఉంచారు.


మాస్టరుగారి నాడీ చరిత్రను స్వతంత్రంగా తెలుసుకోవడానికై తమిళభాషను, లిపినీ నేర్చుకుని రుబండర నాడిలో ఉన్న మాస్టరు జాతక భావములను జాగ్రత్తగా రాసి ఉంచారు.


నరసింహం పంతులుగారు రాసిన వ్యాసములు ఇంకా చాలా ఉన్నవి. ఇవన్నీ వారి నిర్యాణానంతరము వారి సతీమణి, మిత్రుడు సహ ప్రకాశకుడు అయిన శ్రీ పి. ఎస్. ఆర్. శర్మకు అందజేశారు.


శ్రీ పి. ఎస్. ఆర్. శర్మ స్నేహాభిమానముల వలన ఆ గ్రంథములను, మాస్టరు గారి స్వహస్త లిఖితములైన డైరీలను కళ్ళారా చూచి, కాపీలు రాసుకునే అదృష్టం నాకు లభించింది.


ఈ సందర్భంలో నా స్వానుభవములను కొన్ని వివరిస్తేనేగాని కేవలం భాషాంతరీకరణమే చేయకుండా అక్కడక్కడ నాకు కలిగే సందేహాలను భావము లను ఎందుకు చేర్చవలసి వచ్చినదో పాఠకులకు తెలియదు.


నేను 1942 వ సంవత్సరంలో గణేశ నాడిలో వున్న నా జాతకంలో కుంభముని (ఆగస్త్యుడు) మార్గంలో కుంభకోణములో స్థాపించబడిన యోగమార్గంలో కుంఠ మాసంలో, కుంభలగ్నంలో ఉపదేశం పొందుతా”నని వచ్చింది అప్పటికి నేను కేవలం నిరీశ్వరవాదిని(భగవంతుని పై నమ్మకం లేనివారు).

అప్పటికే వైద్య విద్య పూర్తి చేశాను.


”ఇచ్ఛాధీనము లైన కండరములు(self control), వాటి అంతట అవే అనిచ్ఛా ధీనములైన(non self control) నమస్కార కార్యమును సాధిస్తని”


అయినా ఎంత మాత్రం నమ్మక ఎల్లా జరుగుతుందో చూద్దామన్న కుతూహలంతో ఈ యోగ మార్గంలో చేరాను. నన్ను Initiate చేసిన వారు శ్రీ ఎన్. ఆర్. బి. వి. గారు నమస్కారము రావడం, వస్తున్నప్పుడు కలిగే శరీర స్పందనము, స్వయంగా అనుభవించి మన మెరిగిన విజ్ఞానం కన్న అతీతములైన శక్తులు ఏవో ఉన్నవన్న నమ్మకం కుదిరి యీ యోగాభ్యాసం చేస్తూ వచ్చాను.


విపరీతమైన అంగ ప్రకంపనం అభ్యాసకాలములో కలుగుతూ భయోత్పాతం కలిగించేదిగా ఉండేది. ఈ కుతూహలంతోనే నేను నా భార్యను, ఇంకా అనేక మంది స్నేహితుల్ని యోగ మార్గంలో చేర్పించాను.


ఆ సమయంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి పరిచయభాగ్యం లభించింది.


వారితో నా అనుభవాలను వివరించగా వారు Make me fit to realise Brahmam and attain Independency in this life” అని మాత్రం ప్రార్థన చేస్తూ వుండు.


ఇతర Courses ఏమీ చెయ్యకు” అని సలహా ఇచ్చారు.


ఆ సలహా నాకు నచ్చింది.


అప్పటినుంచీ అలాగే చేస్తున్నాను.


ఒక్కొక్కపూట పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, Practice మానేసేవాణ్ని కూడా!


అప్పటికే కౌమార్ నాడీ గ్రంథ ములో నాజాతకము చదివించాను. యోగ విషయాలు తెలుసుకోవడానికి కాదు. ఐహిక విషయములు తెలుసుకుండానికి మాత్రమే.


"కేబుయాయ్ మోణమొండ్రే ‘ఎడుత్తమేయ్ క్కురియబారం”

(“అడుగుతున్నావు కనక చెబుతున్నాను. ఈ ఎత్తిన జన్మకు మోక్షము లేక మౌనము ఒకటే పెద్ద లాభము” అని అమాటకు అర్థం) అని అందులో ఉన్నది. 


అప్పట్లో ఆ కావ్యార్థం బోధపడలేదు. మోక్షం అన్న మాటకు సరైన అర్థమేమిటో ఇప్పటికీ సరిగా తెలియదు.


1950 లో హోరాశాస్త్రం చదివే శ్రీ ఎ. ఎస్. నటరాజశర్మ గారితో పరిచయం అయింది.


వారు ప్రధమ పరిచయం నుండి అపారమైన దయతో, వాత్సల్యంతో నా జాతకము ముఖ్యంగా మోక్షదానము, మాస్టరుగారి జాతకము, ముఖ్యంగా మోక్ష భావము, ఇంకా అనేక మీడియముల మోక్షభావములు ఈ నూతన యోగ భవిష్యత్తుకు సంబంధించిన అనేక కాండలు చదివారు. ఇంకా చదువుతున్నారు. వాటిలో అనేక రహస్యములు బయట వడ్డవి.


సాధారణంగా చచ్చిపోయినవారి జాతకములు హోరా శాస్త్రములో ఉండవు, మాస్టరు గారి భౌతిక దేహ పరిత్యాగానంతరము బ్రతికి ఉన్న వారికి లాగానే దళా భుక్తులతో వివరములు వ్రాయబడి వున్నవి. అట్లాగే నరసింహం పంతులుగారి జాతకం కూడా రాయబడివున్నది.


నా జాతకంలో నాకు ఈ యోగసంబంధమున్న వృద్ధ వైష్ణవ దంపతులతో పరిచయం లభించి అనేక విషయములు తెలుసుకుంటాడని హోరాశాస్త్రంలో ఉన్నది. 


1962 నుంచి శ్రీ ఎన్. నారాయణ అయ్యర్, వారి సతీమణి గార్లతో పరిచయం చేసుకున్నాను. వారు ఉభయులు పుత్ర వాత్సల్యంతో నన్నాదరించి ఎన్నోవిషములు తెలియచేశారు. 


వారు ఉభయులు మాస్టరు మండలం(Loka of Master) చేరుకొనే వరకు(బ్రతికి ఉన్నంతకాలం) వారి తోనే సాయంత్రం ప్రార్థనాదికములు జరిపే వాణ్ని.


1-5-1982 నాడు ప్రార్థనా కాలంలో శిరోభాగములో ఒక హిరణ్య జ్యోతిని చూశాను..అప్పటినుండీ అనేక అనుభూతులు కలుగుతూనే ఉన్నవి. వాటి వివరములు హోరా శాస్త్రం వివరిస్తూనే ఉన్నది.


ఆ సమయములో జరగవలసిన జగత్ప్రళయము, మానవ నాశనము జరుగకుండా తన యోగమాయ వలన మాస్టరు కాపాడారని, ఇంకా మరికొన్ని యోగ విషయములు హోరా శాస్త్రము వివరించింది.

మిత్రులు సీతారామశర్మ “ఈ పుస్తకము తర్జుమా చెయ్యమ”ని అడిగినప్పుడు, ఆ పుస్తకం వ్రాసిన నరసింహం పంతులుగారే ప్రచురింపకుండా వదలినదానిని, నేను భాషాంతరీకరణ చెయ్యడమూ, చెయ్యక పోవడమా? అన్న సంకోచం ఏర్పడింది.


ప్రార్థనా కాలంలో మాస్టరుగారిని కోరగా, “భాషాంతరీ కరించవచ్చు కాని, అలా చేస్తున్నప్పుడు నీకు కలిగే సందేహాలు భావాలు వివరిస్తూ చెయ్యమని లోపలినించి ఎవరో ఆదేశించినట్లయింది.


ఆ ఆదేశానుసారంగా ఈ భాషాంతరీకరణ సాగించాను.


అందులో నూతన యోగశాస్త్ర పరిభాషకు సంబంధించిన పదములు సాధారణ పాఠకుడికి అర్థంకావడం కోసము కొన్ని చిత్రములను, వాటి వివరణలను పొందుపరిచాను.


ఈ విశ్వం సృష్టి శక్తి ఇచ్చవలన ప్రారంభించబడి, క్రమంగా పరిణమిస్తున్నదని, అప్పుడప్పుడు బ్రహ్మమే మానవ రూపంలో వచ్చి మానవుల ద్వారా ఆ పరిణామ ప్రక్రియలను వేగవంతం చేస్తున్నాడని, ఇప్పుడు ఆ బ్రహ్మమే మాస్టరు రూపంలో వచ్చి అభిమానవ కల్పనకై అతీంద్రియ శక్తులను ప్రసాదించడం కొరకై ఈ నూతకు యోగమును ప్రసాదించిపోయినారని, ఈ నూతన యోగాభ్యాసకుల దృఢ విశ్వాసము.


ఆ యోగం ఏ కొద్దిమందికో పరిమితం కాదనీ, ఆ పరిజ్ఞానం ఆ కుతూహులం కలిగిన వారికందరికీ లభ్యమయ్యేటట్లు చెయ్యడం కొందరి విధి అని హోరాశాస్త్రా ఉద్దేశం.


మానవుడు గ్రహయానం చేసినవాడు. పసిఫిక్ మహా సముద్రంలో నుంచి నూతనంగా కొండలు పైకి ఉబికి వచ్చినవాడు యోగ ప్రచారం ఆరంభమౌతుందని, అంతవరకు ప్రచారం చెయ్యరాదని మాస్టరుగారు తనతో అన్నారని. నారాయణయ్యర్ గారు నాతో చెప్పేరు.


ఆ విశ్వాసంతోనే ఆ పవిత్ర కార్య నిర్వహణకు చరమ జీవితాన్ని అంకితం చేసిన నేను మిత్రుడు శర్మ కలిసి యోగ విషయములైన పుస్తకములను ప్రచురింపదలుచుకుని యీ భృక్త యోగ పబ్లికేషన్సు స్థాపించాము.


పోతరాజు నరసింహం పంతులుగారు వేదాంత శాస్త్రాధ్యాపకులు. రచనలో అనేక పారిభాషిక పదములను వాడారు.


నూతన యోగ పదములను ఉపనిషద్గీతా(upanishad+Gita) పదములతో పోల్చి వివరించడానికి ప్రయత్నించారు.

15-8-1970 88, త్యాగరాయ రోడ్, టి. నగర్, మద్రాస్.17

విధేయుడు,


డాక్టర్ శ్రీ గాలి బాలసుందరరావు గారు


__________________________________

Join our Whatsapp Community:



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?