ఈ వ్యాసం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తత్వజ్ఞానం మరియు వ్యాధి గ్రస్తుల చికిత్సా యోగ విధానమును వెల్లడిస్తుంది.




ఈ వ్యాసం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తత్వజ్ఞానం మరియు వ్యాధి గ్రస్తుల చికిత్సా యోగ విధానమును వెల్లడిస్తుంది. 


CENTRE EVERY WHERE CIRCUMFERENCE NO WHERE


"ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ | మా గృథ కస్య స్విద్ధనమ్ |" 

తేన త్యక్తేన భుంజీధాః

“నామరూపాత్మకమైన ఈజగత్తు అంతా ఈశ్వరుని చేత ఆవరింపబడి ఉంది. ఈ జగత్తుగా మనం దర్శించే ఐశ్వర్య మంతా ఆయనదే కాని వేరు కాదు.”  అని పెద్దలు చెపు తున్నారు. 

ఈ అనుభూతి అందరకూ అన్ని భూమికలలోను అందేది కాదు. అట్లని ఎవరికీ అందనిది కాదు. 

ఆ అందని వారు ఈ సృష్టిలో ఆ ఈశ్వరుని(పరమాత్మా) ఐశ్వర్యం కోసం వెదుకుతున్నారు. 

కాని మాకు ఆయన కనిపించుట లేదు. 'ఈశ్వ రుడు ఎచ్చట ఉన్నాడు? 

ఆయనను తెలుసుకునే మార్గ మేది? 

ఆయనను అందుకునే సోపానక్రమం(Hierarchy) ఎట్టిది?' అని ప్రశ్నిస్తూ ఉంటారు. 

ఈ ప్రశ్నించే వారందరూ భక్తులు, ఆస్తికులు. ఇక నాస్తికులుకూడ కొద్ది సంస్కార భేదం ఈ ప్రశ్ననే వేస్తూ ఉంటారు. 

వారి ప్రశ్నలు ఇలా ఉంటాయి. 'దేవుడు లేడు. ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఏదీ కనిపించడేమి? నీకు కనిపిస్తే నాకు చూపించగలవా?' 

ఇలా వారు ప్రశ్నలు వేస్తూ ఉంటారు.

ఇలా ప్రశ్నలు వేసే సంస్కారం కలిగినవాడను నేను(ప్రభాకర శాస్త్రి గారి శిషులు శ్రీమాన్ కొత్త రామకోటయ్య గారు)


అలాంటి నేను కనిపించేదంతా పరమేశ్వరుని ఐశ్వర్య సితిని పొందడానికి గురుపాదులు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి అనుగ్రహమే కారణం. 

వారు పరమ బ్రహ్మణ్యులు.. వారి శిష్యవాత్సల్యం అనుభవించినవారికే తెలుస్తుంది. తన శరీరంలో భాగంగా తన శిష్యులను భావించే వారు. వారి బాధలన్ని తమ బాధలుగా అనుభవించేవారు, వారి ఆనందం కోసం తంపిచేవారు. ఆ తపస్సులో శిష్యుల యొక్క ఆధి వ్యాధులు భస్మము అయిపోయేవి. " 

అగ్గి తగిలిన మైల బుగ్గి అయిపోవును” అని తరచు పలి కేవారు. 

ఆ మహానుభావుల దర్శనమే నా జీవితమునకు ఒక వెలుగు బాట అయినది అజ్ఞానపు చీకట్లు అన్నీ తొలగిపోయి నా జీవితమునకు సూర్యోదయము అయినది. 

అనగా ప్రభాకతోదయము అయినది. 

ఆ విషయమును విపులముగా వివరించి చెప్పెదను.

ప్రభాకరశాస్త్రులవారి దర్శనానికి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడేవాడిని. ఎప్పుడూ శరీరం ఏదో ఒక వ్యాధితో నలుగుడుపడుతూ ఉండేది ఎందరో వైద్యులను ఆశ్రయించడం జరిగింది. ఆయుర్వేదమును కూడ వాడినాను. కాని నాకు స్వస్థత చేకూరలేదు. 

తొట్టి స్నానము, అపక్వ ఆహారములు మొదలగునవి నా కేమి సాయపడలేదు. 

హఠయోగ ప్రదీపకమును అనుసరించి యోగాసనములు ఆశ్రయించినను శాంతి లభిం చలేదు. ఈ విధంగా చాలా శుష్కించి, నీరసించిపోయి మృత్యువాత పడనున్న నన్ను ప్రభాకరులు రక్షించిరి. 

ఏ ఆశ కాని, సంకల్పము కాని లేక శూన్య స్థితిలో ఉన్న నా మనస్సుకు ఒక నిత్యమైన సత్సంకల్పమును నెలకొల్పిరి. 

వారి దర్శనమే నాకు సంకల్ప సూర్యోదయము అయినది. 


నేను 1943 డిసెంబరు 13వ తేదీన శాస్త్రిగారి దర్శ నానికి వెళ్ళాను. 

నేను అంతకుపూర్వం వారిని ఎరుగను వారు భాషా సాహిత్యములయందు చాల ప్రతి భావంతులని, గొప్ప సంస్కృత పండితులని మాత్రమే తెలుసు, అప్పటికి కొన్ని సంవత్సరముల ముందే మా కొత్త వెంక టేశ్వర రావు, వారి శిష్యులు. 

కనుక, ఆయన నన్ను శాస్త్రి గారి వద్దకు తీసుకువెళారు వారికి నన్ను పరి చయంచేస్తూ "మావాడు కొన్ని సంవత్సరాలుగా అనా రోగ్యంతో బాధ పడుతున్నాడు. ఏమి బాగుండలేదు. అందువల్ల మీ వద్దకు తీసుకువచ్చా" అని అన్నారు. 

దానికి వెంటనే శాస్త్రిగారు. "ఈ వేళనుండి ఇతడు బాగానే ఉంటాడు" అని పలికారు. 

ఆ వాక్యమే నాకు అమోఘ మగు ఆశీర్వచనంగా అప్పటి నుండి ఇప్పటివరకూ నా చుట్టూ ప్రదక్షిణం చేస్తూనే ఉంది, నన్ను సదా రక్షిస్తోంది. వజ్రకవచం వలె నా చుట్టూ భాసిస్తోంది. ఆ మాటకి ఉన్న పరిపూర్ణమైన సామర్థ్యం అప్పట్లో నేను గుర్తింప లేక పోయాను. 

శాస్త్రులవారు వైదిక బ్రాహ్మణులు, అందు వల్ల తనకు నమస్కరించిన వారికందరికి శుభమస్తు అని దీవించుట పరిపాటి అని, నన్నుకూడ అట్లే దీవించిరని భావించితిని. అటు తరువాత ఆ అభిప్రాయము తప్పని శాస్త్రుల వారి అనుగ్రహంతో తెలుసుకోన గలిగితిని. 

శాస్త్రి నా అనారోగ్యం గురించి క్షుణ్ణముగా తెలుసుకొన్న వారేనని, ఈ జన్మలోనే కాక ఇంతకు పూర్వజన్మలో కూడ నాకు ఆయనకుగల సంబధాన్ని ముందే ఎరిగిన వారని నాకు ముందు తెలియలేదు. 

కాని ఆ తరువాత వారి మాటలనుబట్టి నేనేమి చెప్పకముందే నా  గురించిన సంపూర్ణమైన ఎఱుక వారియందు భాసించుచున్నదని తెలిసింది. 


నన్ను వారు “నీ పేరేమిటిరా? ఇంటి పేరేమిటి?" అని ప్రశ్నించిరి. ఈ రెండునూ వారు తెలిసియే అడుగుచున్నారని తరువాత మాటలవల్ల  అర్థమయింది, “నీవు పాత రామకోటయ్యవే. కొత్త రామకోటయ్యవు కానే కాదు, నీవు నాతో ఎంతో కాలంనుండి పనిచేస్తున్నావు. రెండు మూడు వందల సంవత్సరాలుగా - కలసి పనిచేస్తున్నావు. ఇకముందుకూడ అట్లే పని చేస్తావు" అని చెప్పారు. 

ఇప్పటికి వారు శరీరాన్ని వదలి 40 సంవత్స రములు అయినప్పటికీ వారు నన్ను వదలలేదు. నాతో కలసియే పనిచేస్తున్నారు. 

రామకృష్ణ పరమహంస గారిని వివేకానందస్వామి మొట్టమొదటి సారిగా దర్శించుటకై వెళ్ళినపుడుకూడ రామకృష్ణ పరమహంస దాదాపు ఇట్లే అనిరట “నీరాకకై నేను ఎన్నో సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్నాను" ఇది పరమగురువులకు శిష్యులపై గల ఆత్మీయతకు గుర్తు.

ఆ సాయంకాలము సమయంలో శాస్త్రుల వారు నాతో 

“నీవు విశ్రాంతిగా కూర్చుండి ప్రార్థనచేయి, మనస్సును విశ్రాంతిగా వదలివేయి కట్టివేయకు. సాక్షి భూతుడవై మనస్సుయొక్క కదలికను గమనిస్తూ ఉండు. కళ్ళుమూసుకొని చూడు” అని పలికిరి. 

కన్నులు మూసు కొని చూడడం నాకప్పటికి అనుభవంలోలేదు. 

నిజానికి కళ్ళు తెరచి చూచినప్పటికి, వస్తువులలో ఉన్న వాస్తవం మనకు కనిపించడంలేదు. కళ్ళు తెరచి చూచినపుడు మనకు ఎప్పుడూ కనిపించే ఈ సూర్య చంద్రాదులు, కొండలు కనిపిస్తూ ఉంటాయి, ఈ కనిపించే వానిని నియమించే శక్తి మాత్రం కనిపించదు. 

గురువుగారు చెప్పినట్లు నేను కళ్ళుమూనుకొని ధ్యానం ప్రారంభించగా లోపల ఏదో చిన్న వెలుగు కనిపించింది, అంతవరకూ శూన్యంగా ఎండిపోయి ఉన్న అంతరంగంలో ఎదో ఆశాజ్యోతి వెలిగింది, ఆ వెలుగులో, నాలో ఉన్న చీకటి మబ్బులు విచ్చిపోయినట్లు అయింది. 

నేను రోగిని, మృత్యువుయొక్క సన్నిధిలో ఉన్నాను అన్న భావం నా అంతరంగంలో ఎగిరిపోయింది. నేను ఇపుడు చాలా బాగున్నాను. అన్న భావం నా అంతరంగములో నిండిపోయింది. 

ఉత్సాహం, ఆనందం అప్పుడు నాకు మొదటి సారిగా అనుభవంలోనికి వచ్చాయి. నా సందేహాలన్నీ తీరి పోయాయి.ఆ భావాన్నే ఆ తరువాత నేను ఇట్లు వర్ణించితిని.


1. నా కేమి భయము లేదిక 

నా కేమి వ్యాధి లేదు నాలోపలి 

ముల్లోకముల నేలు బ్రహ్మము

 నా కన్నుల యెదుట నిలచినట్లాయె గదే!


2. ఏమి ఎంత వింతయొ! 

పోమని యన్నంతలోనె పోయెను బాధల్ 

యీ మహిమ యెందుగల దొకో! 

భూమిసురులు వీరనంగ బోలునో యేమో!


3. భూమిన్ సురులుందు రటం 

చీమాదిరిగాగ నాకు ఎఱుక పరుపగా 

భూమిసురు  శ్రీ ప్రభాకర 

స్వామిన్ కనుగొంటి నేను సద్గురు మూర్తిన్.


ప్రార్థనానంతరం శాస్త్రిగారు ఎంతో ప్రేమతో “ఎలావుందిరా!" అని ప్రశ్నించారు. నేను ఎంతో ఉత్సాహముతో, శాస్త్రిగారితో “చాల బాగున్నాను సార్. కళ్ళుమూసుకొని చూడడం అన్న దివ్యానుభవం నాకు ఇప్పుడే మొదటిసారిగా అందింది. 

నాకు ఇప్పుడు ఎలాంటి వ్యాధి లేదు” అని సమాధానం చెప్పాను. 

అప్పుడు శాస్త్రిగారు. ఎంతో ప్రేమతో “నీవెప్పుడూ బాగానేవుంటావురా ! నీ అవయవాలు ఏమీ చెడిపోలేదు. కాని పనిచేయడం లేదు. ఇప్పటినుండి చక్కగా పనిచేస్తాయి" అని పలికారు

ఈ తొలియోగపాఠాన్ని అనుగ్రహించిన తరువాత మరియొక యోగబోధ అనుగ్రహించారు. 

శాస్త్రిగారు నాతో "నీవు ఉదయం 6 గంటలకు ప్రార్థనకు రా. వచ్చే టప్పుడు నీవు భుజించే ఆహారపదార్థాలలో ఏ పదార్థాలు నీకు వికారము పెట్టి బాధిస్తాయో, ఆపదార్థాలనే తృప్తిగా భోజనంచేసి రా" ఆశ్చర్యం కలిగింది. 

నేను ఎందరో యోగులను, మహాత్ములకు, వైద్యులను కలసి కొన్నాను. కాని ఎవరు ఈ మాట చెప్పలేదు ముందు శాస్త్రి గారు పొరపాటు చెపుతున్నారని భావించాను. 

నా భావాన్ని గ్రహించిన శాస్త్రి గారు నాతో ఇలా అన్నారు. “ఒరేయ్! నేను పొరపాటుపడి చెప్పుటలేదు. 

ఈ యోగా భ్యాసం చాలా ముఖ్యమయింది నీకు ఈ రోజు నుండి ఆహారపదార్థములను గురించిన నిష్ఠ ఉండదు. భగవన్నిష్ట ఒక్క టే ఉంటుంది. ఆహారపదార్థాలన్నీ భగవంతుని ప్రసాదాలేనని తెల్సుకో,” అప్పటినుండి నేను ఆయన మాటను పాటించాను.


ఆ తరువాత మరో యోగపాఠాన్ని అందించారు. శాస్త్రిగారు, ఒక సారి నాతో ఆయన “ఏమయ్యా! ఇక్కడ కూర్చుండి నీవు ఏమని ధ్యానం చేస్తున్నావు?" అని అడిగారు. 

అప్పుడు నేను “నా శరీర ఆరోగ్యం బాగుండాలని ధ్యానం చేస్తున్నాను” అని పలికాను. 

అప్పుడు శాస్త్రిగారు నాతో. "అలా అనుకోవడం చాలా పొరపాటు. నీ ఆరోగ్యం ఎప్పుడూ బాగానే ఉంటుందని చెప్పానుకదా? మరి బాగున్న ఆరోగ్యం గూర్చి ఆరోగ్యం బాగు చేయమని ప్రార్థించ వ్యర్థం. అపుడు నీ ఆరోగ్యం బాగుండ లేదని నువ్వు అం గీకరించినట్లు అవుతుంది. కనుక, నువ్వు ఎప్పుడూ అట్టి భావాన్ని అంగీకరించకు. 

నీ లాభం కొఱకు చేసే భగవత్ ప్రార్ధన ఎలా అవుతుంది ? భగవత్ ప్రార్థన భాగవతీయమైన గతియందే నడవాలి. 

కనుక నీవు నా చుట్టూ ఉన్న వారందరూ బాగుండాలనే ప్రార్థన  చేయి.” అని సెలవిచ్చారు. 

ఈ బోధ యోగశాస్త్రము నందు శిరోమణి వంటింది. ఇది అల్పాక్షరం, అసందిగ్ధం, సారవంతం, విశ్వతోముఖమయినది. 

దాని యొక్క వివరణ కొంత ఇస్తాను.

ప్రార్ధన ఎప్పుడూ వ్యక్తిగతం కారాదు. విశ్వతోముఖం కావాలి. అట్టి దానినే ఈశ్వరుడు అంగీకరిస్తాడు.

ఇందు రెండు విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి శరీరాన్ని చక్కగా పోషించుకోవడం. రెండవది జాగ్రత్తగా పోషించుకొన్న శరీరంమీద ఎప్పుడూ వ్యామోహం పొందకుండా ఉండటం. 

ఈ శరీరంలో జరిగే వ్యాపారం నీ కొరకై పరిమితం కారాదు. నీకొరకు-కూడ ఉపయోగ పడేటట్టు ఉండాలి. అందువల్ల నీవు ఆహారాదులను స్వీకరించడం నీకొరకు మాత్రమే కాదు. నీ-కొరకు-కూడ అన్న భావం కలగాలి. 

అలాంటి వారినే భోక్తలు అన్నారు. 

భోక్త అనగా సామాన్య లోక పరిభాష యందు కూడ, చనిపోయిన తల్లి దండ్రులు కొరకు భోజనము చేయవాడని అర్థము 

అట్టివాడు తన కొరకు కూడ భుజించేవాడు అగుచున్నాడు. 

ఈ భావమునే యోగ మంత్రము ఇట్లు చెప్పుచున్నది.


"సహనా నవతు

సహనౌ భునక్తు" 


అని నిన్ను నీవు రక్షించు కొనగలవు అని భావించుట అజ్ఞానము. 

సహన-అవతు అన్నది సరియయిన జ్ఞానవాక్యము. 

మనందరకు సహకార రక్షణమై ఉన్నది.

ఇక రెండవ భావం 'సహనౌ భునక్తు". అందరి కొరకు మనము భోక్తలు మగు చున్నాము. 

ఇది సరియగు సహకార జీవిత విధానము 


కార్ల్ మార్క్స్(Karl Marx) గారు అందరికి తలో రొట్టిముక్క ఇవ్వాలని అన్నారు. 

అలాకాక అందరూ ఆహార పదార్థాన్ని సమంగా జీర్ణం చేసుకొనే సామర్థ్యం ఇవ్వాలని ఋషుల ప్రార్ధన. 

ఇది ఎంత అర్థ వంతెము! ఈ విషయం శాస్త్రులవారు తరచు చెప్పుచేతల రెండిటి ద్వారా మాకు బోధిస్తూ ఉండేవారు. 


వారి ప్రార్ధనా సమావేశాలకు కడుపునిండా తిన్నవారు, ఏమి తినక నీళ్ళే త్రాగినవారూ వచ్చేవారు. ప్రార్ధన ప్రారంభించిన పది నిముషాలు తరువాత పుష్కలంగా తిన్న వారికి ఆకలివేసేది. మంచి తీర్థం మాత్రమే పుచ్చుకొన్న వారు విఘ్నేశ్వరుల్లలా చల్లగా త్రేన్చేవారు. 

ఆ తరువాత శాస్త్రి గారు ఇలా సెలవిచ్చేవారు. 

“మనం ఆహారాన్ని స్వీకరించినప్పుడు అందు కొంతవరకు మాత్రమే శరీరపోషణ కొరకు ఉపయోగపడును. మిగిలిన ప్రధాన భాగం ప్రాణ పోషణకొరకు ఉపయోగించాలి. 

ఈ విధంగా అన్నంలేని బీదవారికి యోగం ద్వారా పుష్టిని కలి గించాలి. వాళ్ళకోసమే మనం ఆహారాన్ని స్వీకరించాలి. అప్పుడే మనం భోక్తలం అవుతాం.”

ఇంతకంటే సూక్ష్మమైన యోగాభ్యాసం మరొకటి యోగ సమావేశాల్లో జరుగుతూ ఉంటుంది. ఇది బయటకు కనిపించేది కాదు. మన అంతరంగంలో జరిగే యోగ క్రియ అదే 'ప్రాణాట్రీట్' అని సి. వి. వి. గారు వ్యవహరించారు. 

అంటే ప్రాణశక్తి కొరవడి, నీరసించిపోయినట్టి యోగ మిత్రులకు ప్రేయర్ ద్వారా, ప్రాణశక్తిని అందివ్వడం. దీనిని ‘Plenty of Prana Supply' అని వ్యవహరిస్తారు. 

ప్రాణశక్తి పూర్ణంగా లోపించిన వారికి మనం ప్రాణశక్తిని అందివ్వడం అతి ముఖ్యమైన యోగాభ్యాసం. 

ఇలాంటి సామర్థ్యం భగవంతుని కృపవల్లే సాధ్యపడుతుంది. కొందరికొక అనుమానం రావచ్చు. మనకున్న కొద్ది ప్రాణశక్తిని ఇతరులకిస్తే మనమేమవుతాము అని,  అలా ఎన్నటికి జరుగదు. ఈ ప్రాణం తనదను కున్నప్పుడు ఈ భయం కలుగుతుంది. ఈ ప్రాణం ఈశ్వరశక్తి నుండే వచ్చిందని తెలుసుకున్నప్పుడు మనకాభయం పోతుంది. 

అప్పుడే మనకు ప్రాణశక్తి ఆ భగవానుని నుండి అనంతంగ నిరాఘాటంగా సప్లై అవుతుంది. 

ఇది మనలో జరగాలంటే భగవానునియందు పరిపూర్ణమైన శరణాగతి భావం కలిగి ఉండాలి. ఇది కేవలం సిద్ధాంతభాగం కాదు. పరమగురువులు చెప్పి, ఆచరించి చూపిన భాగం. 

ఇట్టి తేజోవంతమైన యోగ ప్రక్రియ గురుపాదులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రులవారి ప్రార్ధనా మందిరంలో జరగటం మొట్టమొదటగా నేను దర్శించాను. 

ఎంతో నీరసంగా వారివద్దకు వచ్చినవారు ప్రార్థన అయిన తరువాత చాల ఉత్సాహంగా తిరిగి వెళ్ళేవారు. 

ప్రస్తుత యోగమిత్రుల సమావేశాలలో కూడ అదే జరుగుతోంది. 

ఇది శాస్త్రులవారి యొక్క అపార ప్రేమతత్వానికి ఒక నిదర్శనం. 

వారు శరీరం వదలిపెట్టిన తరువాతగూడ అట్టి పనులనే వారు మాచేత చేయించుచున్నారు. 

ఇప్పటి మన ప్రార్థనాసమావేశాలలో పాల్గొన్న రోగులందరికి అదే యోగ విధానములో ప్రాణశక్తి అందివ్వబడుతుంది. ఇది వారికి మనపట్లగల ప్రేముకు నిదర్శనం.


ఈ సందర్భంలో మరో విషయాన్ని శాస్త్రిగారు తరచు చెబుతూ ఉండేవారు. బ్రహ్మను తెలిసికోవాలని, అతన్ని చేరుకోవాలని, ఒంటరిగా కూర్చొని తపనపడి తపస్సు చేసే వారు ఎన్నడును బ్రహ్మను పొందలేరు. 

కారణం ఆ స్వర్గం దక్కాలన్న అభిప్రాయం అడ్డుపడుతుంది. దీనినే Vertical Development అనే వారు అలా కాక నీ చుట్టూ ఉన్న వారందరిని పవిత్రమైన శీలం కలవారిగా భావించి వారినందరిని మోక్షము నకు అర్హులగునట్లు చేయుట మనము చేయవలసిన పని. ఈ యోగం Horizontal Development ఔతుంది. 

పరమ భక్తా గ్రేసరుడైన ప్రహ్లాదుని మార్గమిదే. తన తండ్రివంటి వారందరిని మోక్షానికి అర్హులుగా చేసేంతవరకు స్వర్గానికి రానని సృసింహస్వామితో పలికిన మాటలలో ఉన్న అర్థమిదే.

మహా యోగులైనవారు కూడ కొంతకాలం తపస్సు చేసిన తరువాత తమకు లభించిన తపోఫలుతన చుట్టూ ఉన్న మానవులకు పంచిపెట్టుచుందురు. 

బుద్ధభగవానుకు కూడ మొదట తపస్సు చేసి, పరిపూర్ణ జ్ఞానవంతుడై, తానందుకున్న దయ, అహింస, సత్యము మొదలైనవాటిని తన చుట్టూ ఉన్న వారికి ప్రేమ, పంచి పెట్టారు. ఇటువంటి స్థితినే మనందరినుండి శాస్త్రిగారు ఆశించుచున్నారు. 

శ్రీమద్రామనుజులవారు, శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు ఈ మార్గానికి చెందినవారు.

మరికొన్ని దివ్యానుభవాలను ఈ సందర్భంలో చెప్ప దలచాను. 

నేను ప్రార్థనాసమావేశాలలో పాల్గొన్నప్పుడు ఆ ధ్యానంలో మొదటిసారి శాస్త్రి గారి దర్శనార్థం తిరుపతి వెళ్ళిన దృశ్యం గుర్తుకువస్తూ ఉండేది. వెళ్ళిన మార్గంకూడ స్పష్టంగ కన్పించేది. నేను శాస్త్రి గారి సన్నిధిని చేరుకున్నానన్న భావం నాకు ఎంతో ఉత్సాహం ఉండేది. 

ఆ ప్రార్ధనలోనే వారికి సాష్టాంగ దండప్రణామం చేయడం జరిగేది. 

ఇలా కొంతకాలం జరిగిన తరువాత శాస్త్రి గారొక రోజున నాతో "ఒరేయ్ కోట రామయ్య ! నేను నీలోనే సదా వర్తించు చున్నాను. ఈ దివ్యానుభవాలని నీవు మరచిపోయి అప్పుడప్పుడు అటువంటి దివ్యానుభూతి కోసం తిరుపతి ప్రయాణం చేస్తున్నావు. 

నిన్ను సంతృప్తి పరచడంకోసం నేను కూడ తిరుపతి ప్రయాణం చేయవలసి వస్తోంది. 

నీకంటే కొన్ని క్షణాలు ముందుగ వెళ్ళి ఆ గదిలో కూర్చుండవలసి వస్తుంది. ఇది అంతా వ్యర్థం ఇట్టి పని ఇంకెప్పుడూ చేయకు" అని అన్నారు, ఒక సారి ప్రార్థనా సమయంలో గురువు గారిని నేనిలా ప్రశ్నించాను. 

"స్వామి ! మీరు సి. వి. వి. గారి శిష్యులు గనుక సి. వి. వి. గారికి నమస్కారం చెబుతున్నారు. మాచేత కూడ అలా నమస్కారం చేయిస్తున్నారు. 

M. N.(శ్రీమాన్ మైనంపాటి నర్సింహం) గారి శిష్యులందరూ Master M. N. Namaskarams అని,  E.K.(శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు) గారి శిష్యులందరూ Master E.K. Namaskarams అని వారి వారి గురువుల పేర్లను భక్తితో చెప్పుకుంటున్నారు. 

కనుక నేను నా గురు దేవులైన మీ పేరు చెప్పాలని, నమస్కారం పెట్టాలని. ఉత్సాహం ఉబలాటం కలుగుతున్నాయి.  ఆలా చేయవచ్చునా?" అని ప్రశ్నించాను. 

అప్పుడు శాస్త్రి గారు నాతో  "ఒరేయ్ నాయనా ! నేను నీలోనే ఉంటున్నానుకదా. మరి నీవు నాకు ప్రత్యేకంగా నమస్కారం పెట్టినప్పుడు ఆ సమ స్కారాన్ని స్వీకరించడానికి నిన్ను వదలి, నీ నుండి వేరై నీ ఎదుట కుర్చీలో కూర్చోవాలి కదా! అందుచేత నీవు కోరి నట్లే చేస్తాను" అని ప్రేమగా పలికారు. 

అప్పుడు నా తప్పు తెలిసికొని క్షమార్పణ కోరుకున్నాను. "నా అజ్ఞానాన్ని మన్నించండి. మీ రెచ్చట ఉన్నారో అచ్చటే ఉండండి" అని నమస్కారం పెట్టుకున్నాను.

అటు తరువాత నాకు శ్రీ శాస్త్రిగారు మరియొక సోపానము అందించిరి. ఒక నాడు ధ్యానములో వారు నన్నిట్లు ఆదేశించిరి "ఇప్పటి వరకు నీవు ప్రార్థనా సమావేశాలకు హాజరైనవారి యోగక్షేమాలను గూర్చి ప్రార్ధన చేస్తున్నావు. 

ఆ హాజరైన వారిలో ఎవరు ధనికులో, అధికారులో అని, ఎవరు యోగసభ్యులో అని, భేదం ప్రధానంగా నీలో లేనప్ప టికి, భేద దృష్టి ఛాయామాత్రంగా నైన నీలో పని చేస్తుంది.

ప్రార్థనా సమావేశాలకు వచ్చినవారు నీ బంధువులని కాని, యోగమిత్రులని కాని, వేరుభావంతో చూడటం ఈ రోజు నుండి మానేయ్. ఆ ఉన్న వారంత ఒకే ఒక బృందం (Unit) అన్న జ్ఞానం నీలో ఇప్పటి నుంచి పనిచేస్తుంది. 

ఒకరికి ఒకరికి మధ్య తేడా లీలగా కూడా ఉండరాదు. 

మరో మాట - సమావేశానికి హాజరైనవారని, హాజరుకానివారని భేదభావం ఈ రోజునుండి నీ మనస్సునందు మెదలరాదు. అదేకాక ఈ యోగాభ్యాసం చేయనివారు, ఈ యోగం తప్పని భావించేవారు కూడ నీకు మిత్రబృందములోనివారే అగుదురు. 

రోగార్తులై వచ్చినవారందరూ యోగమిత్రబృందమే. రాని, రాలేని రోగార్తులు కూడ ఆ బృందంలోని వారేనని తెలుసుకో. హేతువాదులు, నాస్తికవాదులు అన్న భావంకూడ నీ మనస్సులో పనిచేయరాదు. అందరియందు సమానమైన ప్రేమ, ఆదరం కలిగి ఉండటానికి ఈరోజు నుంచి నీవు ప్రయత్నం చేయి.

ఇట్టి ప్రయత్నం నేను చెప్పినంత మాత్రంలో, నీవు విన్నంతమాత్రంలో తక్షణమే నీ అనుభవానికి అందేదికాదు. అయినప్పటికి నీవేమి దిగులు పడవద్దు, సిగ్గు పడవద్దు, ఓడి పోయినానని భావించకు. అలా భావించడం సామాన్య మానవుల లక్షణంకాని, యోగి లక్షణంకాదు, దీక్షతో మాష్టారియందు శరణాగతభావంతో ముందుకు సాగు. నీకు నేనెప్పుడు సాయపడుతూనే ఉంటాను" అని ఎంతో ప్రేమగ చెప్పారు.

మనస్సు సమస్థితిని నిండుగ అందుకోలేని స్థితియందున్న నాకు ఈ బోధ ఎంతో  ఉత్సాహాన్నిచ్చింది. ప్రార్థనకు వచ్చినవారు ఏ ఊరివారు? వారి బాధ ఏమిటి? అన్న ఆలోచనలు ఛాయానా ఉండేవి. నాటినుండి అవన్నీ శ్రీవారి అనుగ్రహంతో ఆగిపోయాయి. 

అందరియందు ఒకే దృష్టి ఏర్పడింది. నా చుట్టూ ఉన్న వారి అందరిలోను భగవానునియొక్క భాగవతీయమైన తేజస్సు వచ్చి నిండారవలెను అన్న కోరిక ఒక్కటి మాత్రమే మిగిలి ఉండేది. అదిచాల ఆశ్చర్యకరంగ పనిచేసింది. ఆ చుట్టూ ఉన్నవారి బాధలు క్రమంగ తొలగి పోవడం ప్రారంభ మైంది. 

ఇదియే "ఏకాగ్ర వృత్తి" అని శాస్త్రులు వారు ఒక సందర్భంలో వివరించారు.

"ఏకాగ్రవృత్తి అంటే నీకు ఒకే ఒక సంకల్పం ఉండాలి. అది దేనితోను ముడివడరాదు దాని-కదిగానే, ఒక్కటిగానే, నీలో పనిచేయాలి" అని శాస్త్రిగారు చెప్పారు. 

ఇలా కొంత కాలం జరిగిన తరువాత ఒక ప్రశ్న ప్రత్యక్షమయ్యేది. "ఈ ప్రార్థనలకు వచ్చేవారందరూ ఒకేతరహా వ్యాధుల వారు కాదు కదా ! బాధలలో హెచ్చుతగ్గులు చాల ఉన్నాయి. మీరు అందరిని సమానంగా చూడమంటున్నారు అధికంగా బాధపడేవారిని చూస్తూ ఊరకుండ వలసిందేనా ?" అని శాస్త్రిగారిని గట్టిగా అడిగాను. 

అప్పుడు శాస్త్రిగారు ఇంకా గట్టిగా చెప్పారు. "ఇది తప్పు అభిప్రాయం కాదు. రోగులయొక్క బాధలు గూర్చి నీవు కొంత శ్రద్ధ తీసుకోవచ్చు. ఏ వైద్యవిధానానికి లొంగని వ్యాధులతో బాధపడేవారిని గూర్చికూడ నీవు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చు" అని బోధ చేశారు. 

అప్పుడు నేను శాస్త్రి గారిని "అట్టి వ్యాధి ఎడల సానుభూతి, శ్రద్ధచూపుట అది రాగమే అగునుకదా ! ఇతరుల యెడల ద్వేషము అగును కదా! ఇది దోషముకదా?" అని అడిగాను అప్పుడు శాస్త్రిగారు. నాతో "ఒరే! నీవు గజిబిజి పడకు. నీకు రోగులందరు సమానమే అది సత్యం. 

వారి బాధల యొక్క తీవ్రతలనుబట్టి వారియందు శ్రద్ధచూపుట అనగ ఇతరుల యందు అశ్రద్ధ చూపుట కానేకాదు. 

అదినీకు రాగ ద్వేషములను ఆపాదించదు. మృత్యుముఖమున ఉన్న వారిని రక్షించుటకు ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకొనవచ్చును" అని వివరించి చెప్పిరి. 

అప్పటి నుండి సమావేశమునకు హాజరైనవారి సంఖ్యనుగాని, వారి అవసరముల గురించిగాని ప్రత్యేకంగ ఆలోచించు పని తొలగి పోయినది. మనస్సు తేట పడినది. సందేహాలు ప్రశ్నలు మొదట అప్పుడప్పుడు వచ్చినా క్రమంగ వెలసి పోయాయి. 

నా మనస్సుకు ఒక రూఢమైన స్పష్టమైన వెలుగుబాట గోచ రించడం ప్రారంభించింది. ఇది ఒక సోపానం.


ఆ తరువాత ఒక నాడు ప్రార్థనలో గురుపాదులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు నాకు ఈవిధంగా బోధించారు. 

"ఈరోజు నుండి నీకు ఏకాగ్రత అన్న యోగాభ్యాసం అనుభవమున ఉండదు.

 నీ మనస్సును నిర్వృత్తిలో స్థిరపరచుకో. మనస్సు ఎలాంటి వృత్తి, యోచన, కదలిక ఉండరాదు. 

మనస్సు తేజోమయము కావలెను. అనగా ఇప్పటివరకు నీవు అభ్యా సము చేసిన సోపానములు(hierarchy) మూడింటిని దాటి పోవలెను. 

అన్నమయ కోశమును(Physical Body) గూర్చి స్ఫురణ క్రమముగ రహితమై ప్రాణమయకోశమునందు(etheric body/sheath) లయమైపోవలెను. ఈ విధంగా లయమైన ఈ నీ ప్రజ్ఞతో మనోమయమై(Mental Body/Sheath) మనస్సు(the sensory or processing mind)నందు కలసి పోవును. 

(Note: Master Literature and Traditional Yoga Literature differs up to some extent in Terminology.

Rough Assumption as follows:

Annamaya - Physical + Etheric

Pranamaya - Etheric + Astracal,

Manomaya - Mental Roopa and Mental Aroopa

Vignanamaya - Buddhic

Anandamaya - Nirvana + Para Nirvana + Maha Para Nirvana)

ప్రత్యేకముగా నీ ప్రాణము, శరీరము అన్న స్పృహ ఉండనే ఉండదు. రెండును నీ మనస్సులో లయమై పోతాయి. అలాంటి మనస్సు నిర్వృర్తిలోనికి వెళ్ళిపోయి నిలచినప్పుడు నీ మనస్సుకు పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది. 

Physical Silence నుండి Vital Silence లోనికి వొచ్చి Physical Vital Silence లోని ప్రశాంతత Mental Silence గా నీకు లభి స్తుంది.

మనస్సులో ఒక భాగమే ప్రాణం, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, 

హృదయస్పందనలు అన్నీ మనస్సులోని జాగాలే. 

మనస్సు ఆగిపోయినప్పుడు అవన్నీ ఆగిపోతాయి. 

అప్పుడు నీవు గాలి పీల్చవలసిన అవసరం, వదిలివేయవలసిన అవసరం ఉండదు. 

అంతా శాంతిగ, విశ్రాంతిగ ఉండును. 

అనగ ఇది మనస్సుకు పూర్తి విశ్రాంతి లభించిన స్థితియే. మనస్సుకు Concentration పూర్తిగా రద్దయిన స్థితి అని తెలుసుకో, 

అప్పుడు నీకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పని ఉండదు. 

ఇలా ప్రశాంత మైన స్థితిలోనికి మనస్సు వెళ్ళిన తరువాత నీ మనస్సు భాగవతీయమైన వెలుగును అందుకొనగలదు.  అప్పుడచ్చట నీకొక వెలుగు మాత్రమే కన్పించును. ఆపైన ఇక ఏమీ లేదన్న భావము నీకు తోచును. అందుండియే అనగ ఆ లేని స్థితినుండే సర్వమూ వచ్చుచున్నదని ఆ తరువాత నీకు తెలియగలదు. 

దీనిని గురుపాదులు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు 'గోదా వైభవం'లో ఇట్లు చెప్పిరి.

"ఏమిలేనట్టి గగనాన ఇమిడి ఉండి

అన్ని ఉన్నట్టి భూమిని అవతరింతు"

దీనినే తైత్తిరీయ ఉపనిషత్తు మంత్రద్రష్ట ఇట్లు వర్ణించెను.... 


.......అన్దరేణ తాలుకే యఏషస్తవ ఇవావలంబతే సేంద్రయోనిః 

యత్రాసౌ కేశాన్తో వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే.......

(శిక్షావల్లి షషోనువాక :)


నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల నడుమగ వెళ్ళినప్పుడు, నీజ్ఞాన కిరణముల చివరివరకు వెళ్ళి శీర్షమును అనగా నీయొక్క జ్ఞానమును, అజ్ఞానముయొక్క చివరి భాగాన్ని దాటి పైకి వెళ్ళినప్పుడు అచట భాగవతీయమగు తేజస్సునీకు లభిస్తుంది.

గురుదేవుల అనుగ్రహం వల్ల ప్రస్తుతం ఇదే నాలో పనిచేస్తుంది. ఏక కాలంలో వివిధ ప్రాంతాలలో ఉన్న రోగులకు ప్రశాంతతను కలిగిస్తోంది. 

అందువల్ల గురుదేవుల ప్రజ్ఞ కేంద్రం అవుతే, దానిచుట్టు ఉన్నది పరిధి అవుతోంది. సెంటరు అంతటా ఉంటుంది. అంటే గురు ప్రజ్ఞ అంతటా నిండి ఉంటుంది. 

ఇటువంటి మహిమాన్వితులైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి దివ్యాశీస్సులు మిమ్ములనందరిని చల్లని మార్గమున నడిపించుగాక అని ఆశీర్వదించుచున్నాను.


గుంటూరు 

శుక్ల కార్తీక బహుళ తదియ

ఇట్లు 

కొత్త రామకోటయ్య

___________________________

Join our Whatsapp Community:

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?