పాకలపాటి గురువు గారితో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శిష్యులు కొత్త రామకోటయ్యగారి ముచ్చట్లు



పాకలపాటి గురువు గారితో  శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శిష్యులు  కొత్త రామకోటయ్యగారి ముచ్చట్లు

(తాత గారు:  శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శిష్యులు కొత్త రామకోటయ్యగారు)

నర్సీపట్నం ప్రాంతంలో పాకలపాటి గురువుగారిని తెలియనివారుండరు. ఆయన చాలా మహిమాన్వితులు. సుమారు 700 గ్రామాల ప్రజలపై ఆయన ప్రభావం ఉంది. వీరి మహిమలను గూర్చి శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. ఆయనను గూర్చి ఇప్పటికీ ఆ ప్రాంతం వారు కథలు కధలుగా చెప్పుకుంటారు. ఆ అరణ్య ప్రాంతం లోని కొండజాతివారికి ఆయనే ఇలవేల్పు. 

శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారితో ఆయనకు చాల సన్నిహిత సంబంధాలుండేవి. శ్రీమాన్ E.K  గారిని 'డాక్టరుబాబు' అని పిలుస్తూ ఉండేవారు. 

తరచు శ్రీమాన్ E.K గారు పాకలపాటి గురువుగారి వద్దకు వెడుతూ ఉండే వారు. ఈ రీత్యా తాతగారికికూడ పాకలపాటి గురువు గారితో పరిచయం ఏర్పడింది. వీరిరువురు కలసిన సందర్భంగూర్చి తాతగారు చాలాసార్లు అత్యంత రమణీయంగా, హృదయ పూర్వకంగా చెపుతూ ఉంటారు. ఆ సన్ని వేశాన్ని నేనిక్కడ ఉటంకిస్తూన్నాను.

ఒకసారి పాకలపాటి గురువుగారు విశాఖపట్నం దత్తుగారి బంగళాకువచ్చి శ్రీమాన్ E.K గారి గురించి కబురుపెట్టారు. E.K.గారు ఏదో అర్జెంటు పనుండి వెడుతూ, తాను సాయంకాలం వచ్చి కలిసికుంటానని చెప్పి, తాతగారిని అక్కడకు పంపారట. తాతగారు దత్తుగారి బంగళాకు వెళ్ళి గురువుగారిని దర్శించి వారి ప్రక్కనే కూర్చొని తమాషాగా కబుర్లు చెబుతూ ఉండగా ఒక డాక్టరుగారు పాకలపాటి గురువు గారిని చూడటానికి వచ్చారు. పాకలపాటి గురువుగారికి ఆ సమయంలో జ్వరంగా వుంది. వచ్చిన డాక్టరు భయపడుతూ, భయపడుతూ ఆయన నాడి చూశారట. భయపడుతున్న కారణంగా నాడి సరిగా చూడ లేక పోయారు. అదిచూచి తాతగారు "92 ఉంది. మీరు చూడనక్కరలేదండి " అన్నారు. డాక్టరు బిత్తరపోయి ఎందుకైనా మంచిదని అంగీకరించి గురువుగారి బి. పి. చూడ టానికి ప్రయత్నిస్తుండగా “అది నాలుగు పాయింట్లు ఎక్కువ ఉందిలెండి 3 గంటలకు విరోచనం అవగానే అన్నీ సర్దు కుంటాయి” అన్నారు తాతగారు. అసలే బిక్కు బిక్కు మని ఉన్న డాక్టరు బ్రతుకుజీవుడా అని గురువుగారికి నమస్కారం పెట్టి అక్కడనుండి చల్లగా జారుకున్నారు. ఆయన వెళ్ళాక గురువుగారు తాతగారితో “ఇవన్నీ మీకెలా తెలిసాయి? మీరేమీ నా నాడి పట్టుకోలేదుకదా !" అని అడిగారట.

వెంటనే తాతగారు బహులౌక్యంగా "మీరేకదా చెప్పమంది" అన్నారు. గురువుగారు చిరునవ్వు నవ్వి "గట్టివాడి వేనోయ్" అన్నారు. ఆ తరువాత 3 గంటలకు విరోచనం అయి జ్వర ముతోపాటు మిగతావన్నీ సర్దుకున్నాయి. ఈలోగా దత్తు గారింట్లోంచి రెండు 3 పళ్ళాలతో భోజనంలాంటి టిఫిన్ తీసుకువచ్చి ఇద్దరిముందు పెట్టారు. ఇద్దరూ అతిసునాయాసంగా ఆ పళ్ళాలు ఖాళీచేశారు. పాకలపాటి గురువుగారు 'గట్టివాడ వేనోయ్' అంటూ ఆనందపడ్డారట. తాతగారు ఈ సన్ని వేశం చెబుతూ “మనం ఏమన్నా తీసిపోయామా! వాళ్లు ఇచ్చిన గోధుమ ప్రసాదాన్ని, లెక్కకు మిక్కిలిగా ఉన్న గారెల్ని, సోలెడు గ్లాసుతో కాఫీని సునాయాసంగా లాగించామంటే తిన్నది నేనేనా? అవి ఎక్కడకు-పోవాలో అక్కడికే పోయాయి. నాలో కొండంత అండగా శాస్త్రులవారు నిలబడి ఉంటే మనకేం భయం. అంతా ఆయనే చూచుకుంటారు. ఇది జ్ఞాపకం ఉన్నన్నాళ్ళు ఎన్నడూ చెడిపోరు. మరపు వచ్చిందా మరుక్షణంలో పతనం తప్పదు" అని అన్నారు.

రచన: బి. వి. నరసింహరాజు.

__________________________________

Join our Whatsapp Community:

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?