Independence Declaration in Telugu

మాస్టర్ C.V.V.

స్వతంత్ర ప్రకటన


అందరమూ జన్మ తీసుకొన్నది మొదలు జీవదశ ముగిసేవరకు ఏమేమి చేయవలెనో పెద్దలు, శాస్త్రజ్ఞానము బాగా తెలిసినవారు ఇచ్చిన పద్దతులను అనుసరిస్తూ వస్తున్నాము. అందులో, వర్ణాశ్రమమునకు తగినట్లు వారి వారి జాతికి తగిన ఆచార నడవడికలను, మనలను పుట్టించిన సృష్టికర్త యెడల మనము ఏవిధముగా నడచుకోవాలనే దానికి విధివిధానములను నియమాలుగా ఉంచినారు.


ఈ విధముగా ఉండుట, భర్త ఏ విధముగా జీవితము నడుపుచున్నారో అందుకు తగిన విధముగా స్త్రీలు ఉండవలెనని చెప్పబడిన దానికి కట్టుబడి ఒక కులస్త్రీ ధర్మ పద్దతిలో నడచుకున్నట్లుగా ఉన్నది కానీ, మనకు జ్ఞాన భాగం ఒకటి ఉన్నదనే భావన లేకుండా గృహకృత్యములను సరిగా నడుపుకుంటూ, మనవారిని ఆదరిస్తూ వస్తూ, ముగింపు వచ్చు కాలములో ఏదో జన్మ ఎత్తినందుకు చేయవలసినవి చేసినాము, ఇక మంచిగతే ఉంటుంది, మరుసటి జన్మ నాణ్యముగా ఉంటుంది అనే ఆలోచన చేస్తూ రోజులు గడుపుతూ ఉంటాము.


ఈ విధమైనటువంటి జీవితములో - మనకు ఇటువంటి సృష్టి ఏ కారణముగా ఏర్పడినది? మనకు ఈ మానవులుగా ఎందుకు జన్మ ఇవ్వబడినది? ఇప్పుడు ఇంకా ఎన్ని జన్మలకు వెళ్ళవలసి ఉన్నది? అంతిమ ఫలితం ఏమిటి? మనము ఉన్న విధానములో మనకు ఏర్పడి ఉన్నవారు(సంతానం) మనకే ఎందుకు ఏర్పడినారు? - ఇటువంటి వివరములను తెలుసుకోకుండానే మనము జీవిస్తున్నాము.


కుటుంబ జీవనములో మనము అలా నడచుట వలన పైన చెప్పిన ప్రశ్నల గురించి విచారించుటకు గానీ, వాటికి సంబంధించిన జ్ఞానమును అందుకోడానికి ప్రయత్నించడానికి కానీ మనకు సమయము లేదనుకుంటూ, ఉన్నామంటే ఉన్నామని కాలము గడుపుతూ, మనకు తెలియలేదే!, మూర్ఖత్వముతో కాలము గడుపుతున్నామే! అని చింతిస్తే మాత్రం ముగింపు ఎప్పటికి దొరుకుతుంది?

అందుకు తగిన ప్రయత్నం చేయాలి కదా. అటువంటి ప్రయత్నము కొఱకు మనము అవకాశమును ఏర్పరచుకొని దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఉద్దేశ్యములతో లఘువైన పద్దతిలో ఒక మార్గమును ఉపదేశించుట ఈ సొసైటీ లో జరుగుచున్నది.


సాధారణ జ్ఞానమే ఉండవచ్చు, రోజులు కష్టం లేకుండా గడిచిపోవచ్చు,పెద్దలు ఇచ్చిన మార్గములో భక్తితో ఈశ్వరుని ఆరాధించవలెనని మనసులో నాటుకొని ఉంచుకున్న వారికి కొన్ని అనుష్టానమార్గములను ఇచ్చి ఉన్నారు. వాటిని అనుసరించుట చాలా శ్రమతో కూడినది. పైగా, మరిన్ని జన్మలకు వెళ్ళవలసిన విధముగా ఆ మార్గముల విధానములు ఉన్నవి.


ఆ విధముగా లేకుండా, ఏ విధమైన పేదరికముతో ఉన్నప్పటికీ, మూర్ఖత్వముతో ఉన్నప్పటికీ, లఘువైన విధానములో జ్ఞానమును పొందడానికి, సృష్టి రహస్యములను బోధించడానికి, ఈ సృష్టికి కారణము ఇది అని తెలిసికొని, మనము దుష్ప్రభావములు లేకుండా ఉండడానికి మార్గము చూపించబడుచున్నది.


సన్యసించనవసరము లేకుండా సర్వ జ్ఞానమును ఇస్తూ, కుటుంబ జీవితము గడుపుతూనే మనకు వ్యాధి, వృద్ధాప్యము, మరణము లేని స్థితి కలిగించుటకై మార్గము ఏర్పర్చబడినది. మన రోజువారీ జీవితములో కష్టములు, బాధలు, మరే విధమైన లోటు లేకుండా ఉండటానికి ఏర్పాటు చేయబడినది. మనకు మాత్రమే కాక మనతో చేరి ఉన్న వాళ్లకి కూడా ఈ ఫలములు అందగలవు.


మనము ఎవరము? ఎందుకు ఇక్కడకు వచ్చినాము? ఎటు వెళుతున్నాము? ఇటువంటి వాటిని తెలుసుకోవడానికి యోగసాధన ముఖ్యమని అందరూ అంగీకరించిన విషయం. అందుకు కుండలిని అనే శక్తితో ప్రయత్నించవలెనని యోగులు తెలిసికొని ఉన్నారు. ఈ రీతిలో ఏర్పర్చబడ్డ అభ్యాసములలో రాజయోగము అనేది ఉన్నతమైనదని పతంజలి ఋషి మొదలైన వారు తెలియపరచినారు. ఇది అష్టాంగయోగమని కూడా పిలువబడుతున్నది.


ఇటువంటి యోగము ద్వారా సమాధిస్థితిని చేరుకోవడం అంటే, ప్రాణాయామ పద్ధతి ద్వారా కుంభకము అనే నిశ్వాసప్రక్రియ జరుపకుండా ఉండే సమయములో, కుండలినీ శక్తి శరీరములో చర్యలు చేసే ప్రయత్నములో వ్యావహారిక బాహ్య ప్రజ్ఞ నిలిపివేయబడినప్పుడు సమాధి స్థితి ఏర్పడటము. ఇటువంటి  స్థితిని పొందడము చాలా ప్రయాసతో కూడినది.

ఇప్పుడు నడుస్తున్న కాలములో దీనిని చేరడము దుర్లభము. ఆ విధముగా జరిగినట్లయితే, కుండలినీ అంచెలంచెలుగా కైవల్య స్థితిని అందించగలదు అనేది ఆ పద్ధతిలోని సిద్ధాంతం.


ఇలా చేయడంలో తాత్పర్యం ఏమిటంటే, ఈ భౌతిక శరీరము ఎందుకూ ఉపయోగము లేనిదని. ఇది నాశనమయ్యేదే అని తీర్మానించుకొని, మనకు లోపల ఉన్న సూక్ష్మ శరీరమును శుద్ధపరచుకొని, మన మనసుకు ఇవ్వబడి ఉన్న పూర్వవాసనలన్నింటిని నాశనము చేసికొని కైవల్యము పొందవలెనని పెద్దలు తెలియజేసారు.


కనుక ఈ శరీరముతో ఈశ్వరుడు ఎక్కడ ఉండునో తెలుసుకోలేమని అర్థమవుతున్నది. ఇలా ఇవ్వబడిన సృష్టి క్రమమునకు సాంఖ్య పథమని పేరు. వేదాంతులు జాగృదావస్థ అనే భావనతో వేరే విధముగా సృష్టి క్రమమును చెప్పి ఉన్నారు. ఇంకా మరికొందరు పరిమిత రూపముతో ఉన్న ఈశ్వరుడు తనకుతానే బ్రహ్మముగా ఈ అండములను   సృష్టించినాడని చెప్పినారు. ఇలా అనేక రీతులలో చెప్పబడిన వాటిని ఆలోచించి చూసినట్లయితే దేనిని నమ్మి నడవాలనే సందేహము ఉంటుంది కదా.


అన్నిటికి కారణము ఒక్కటే కదా ఉండవలసినది! ఆ పరమాత్మాను చేరుటకు ఒక మార్గమే కదా ఏర్పడి ఉండవలసినది! అటువంటప్పుడు అనేక మతస్తులు, అనేక మతములు ఎలా తయారైనాయి? ఇటువంటి సృష్టి ఈశ్వరునిది ఎలా అవుతుంది?

ఇటువంటి సందేహములు ఉండే ఈ భరత ఖండములో మనము ఈ జీవ దశ కాలములోనే ప్రత్యక్షముగా సృష్టి రహస్యములను చూసి, మన స్థితి ఏమిటో గమనించుకొని, మనము ఏ విధముగా ఉండాలో తీర్మానించుకొనడం ఉత్తమం కదా! అంతే కాక పైన చెప్పిన మతముల తాత్పర్యముల ప్రకారము నడచుకుంటూ, ఏదైనా ఇబ్బంది కలిగితే ఇతర మతములకు వెళ్ళడం, ప్రత్యక్ష అనుభవము లేని వారి మతములను నమ్మి నడవడం శ్లాఘనీయమవుతుందా? 


ఇత్యాది విషయములను ఉద్ద్యేశించి జనులందరి ఉపకారార్ధమై ఈ సొసైటీని ఏర్పరచి, ప్రజలందరికీ ఎటువంటి పక్షపాతము లేకుండా స్థూలములోనే ప్రజ్ఞతో ఉన్నపుడే కుండలినీ చూపించు సర్వ జ్ఞానములను మనము పొందడానికీ, స్థూలములోనే కైవల్య స్థితిని చూపి పరమాత్మాను తెలుసుకోగలిగిన జ్ఞానివలె చేయడానికి మనకు ఉన్న సందేహములతో ఏర్పడే సంఘర్షణలను తీర్చే పద్ధతులు ఇవ్వబడినవి.


స్థాపితం 1910

యోగాలయ మిత్ర సంఘం, 2, దిగువ డాబిర్ స్ట్రీట్.

కుంభకోణం.

మాస్టర్ C.V.V. గారు 1910 లో తమిళములో ఇచ్చిన స్వతంత్ర ప్రకటనకు అనువాదము. 
(తమిళ రచనను అర్ధము చేసికొనుటలో తోడ్పడిన శ్రీ రవీంద్రన్ సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతా పూర్వక నమస్సులు.)

అనువాదము చేసిన వారు: శ్రీ ఉమాకాంత్ అక్కిరాజు గారు.

--------------------------------------------


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?